సోమవారం 13 జూలై 2020
International - Jun 06, 2020 , 03:30:25

ఇది 401 ఏండ్ల వ్యధ

ఇది 401 ఏండ్ల వ్యధ

  • మాపై నాలుగు శతాబ్దాలుగా అణచివేత
  • మా మెడలపై మోకాళ్లు తీయండి
  • నల్లజాతీయులు గొంతెత్తే సమయం వచ్చింది
  • ఫ్లాయిడ్‌ సంస్మరణ కార్యక్రమంలోపౌరహక్కుల కార్యకర్త రెవరండ్‌ షార్‌ప్టన్‌
  • హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

మినియాపొలిస్‌: నాలుగు శతాబ్దాలుగా నల్లజాతీయులు అణచివేతకు గురవుతున్నారని, ఇక గొంతెత్తే సమయం ఆసన్నమైందని పౌర హక్కుల నాయకుడు రెవరెండ్‌ షార్‌ప్టన్‌ పేర్కొన్నారు. అమెరికాలోని మినియాపొలిస్‌లో శ్వేతజాతి పోలీస్‌ అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్‌ఫ్లాయిడ్‌ సంస్మరణ కార్యక్రమానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో హాలీవుడ్‌ ప్రముఖులు, సంగీతకారులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. మినియాపొలిస్‌లోని నార్త్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉన్న ప్రార్థనా మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్‌ప్టన్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ‘మా మెడలపై నుంచి మీ (శ్వేతజాతీయులు) మోకాళ్లు తీయండి’ అని నల్లజాతి ప్రజలు గొంతెత్తే సమయం ఆసన్నమైందని చెప్పారు. ‘ఫ్లాయిడ్‌ కథ నల్లజాతి ప్రజలందరిది. ఎందుకంటే, 401 ఏండ్ల కిందటి నుంచి, మేం కోరుకున్నవి, కలలు గన్నవి ఎన్నటికీ పొందకపోవడానికి కారణం.. మా మెడలపై మీరు మోకాళ్లు నొక్కిపెట్టడమే’ అని వ్యాఖ్యానించారు.

ఇక ఆ మోకాళ్లు తీయండని గొంతెత్తే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను సమూలంగా మార్చేందుకు ఇది ఉద్యమంగా మారనుందని చెప్పారు. ‘మిమ్మల్ని బాధ్యులను చేయకపోవడానికి, మీరు సాకులు చెబుతుండడానికి, ఉత్తుత్తి మాటలకు, ఉత్తుత్తి హామీలకు ఇక సమయం మించిపోయింది’ అని అన్నారు. కార్యక్రమంలో రెవ్‌. జెస్సీ జాక్సన్‌, సెనేటర్‌ ఎమీ క్లోబ్‌చర్‌, ఇతర అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఇహాన్‌ ఒమర్‌, షీలా జాక్సన్‌ లీ, అయనా ప్రెస్లీ, సెలబ్రిటీలు లుడాక్రిస్‌, టైరెస్‌ గిబ్సన్‌, కెవిన్‌ హార్ట్‌, టిఫానీ హాడిస్‌, మర్సాస్‌ మార్టిన్‌ పాల్గొన్నారు. ఫ్లాయిడ్‌ను పోలీసులు నేలమీద మోకాలితో తొక్కిపెట్టిన సమయాన్ని గుర్తుచేస్తూ సుమారు 8 నిమిషాల 46 సెకండ్లపాటు మౌనం పాటించారు. ఫ్లాయిడ్‌ సంస్మరణ కార్యక్రమాల్లో ఇది మొదటిది. శనివారం రేఫోర్డ్‌, సోమవారం హ్యూస్టన్‌లలో నిర్వహించనున్నారు. మరోవైపు, ఫ్లాయిడ్‌ హత్యకు సహకరించిన ముగ్గురు పోలీస్‌ అధికారులకు స్థానిక కోర్టు 7,50,000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది.

వృద్ధుడిని తోసేసిన పోలీసులు.. తలకు గాయం

ఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ అమెరికావ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఒక వృద్ధుడిని పోలీస్‌ అధికారి ఒక్కసారిగా తోయడంతో అతడు కిందపడిపోయాడు. నేలకు బలంగా తల తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఇద్దరు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.


logo