గురువారం 04 జూన్ 2020
International - Apr 23, 2020 , 02:39:24

‘లాక్‌' ఎత్తేస్తున్నారు

‘లాక్‌' ఎత్తేస్తున్నారు

  • ఆంక్షలు సడలిస్తున్న ప్రపంచదేశాలు 
  • అయినా ప్రజల్లో తగ్గని కరోనా భయం 
  • సడలింపు సబబు కాదంటున్న నిపుణులు 

బెర్లిన్‌: కొన్నాళ్లుగా దిగ్బంధంలోఉన్న ప్రపంచం మెల్లగా  గిరిదాటుతున్నది. ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. బెర్లిన్‌లో బుధవారం ఆంక్షలను సడలించారు. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. వినియోగదారులు, వర్కర్లు వైరస్‌ భయంతో ఇండ్లకే పరిమితం కావడంతో ఆశించిన ఫలితం రాలేదు. దుకాణం తెరిచినందుకు సంతోషంగానే ఉన్నా.. కొందరు వైరస్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని బెర్లిన్‌కు చెందిన హూగీ అనే బొమ్మల దుకాణం యజమాని పేర్కొన్నారు. డెన్మార్క్‌, ఆస్ట్రియా వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి. నెల రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న సెర్బియాలో బుధవారం మార్కెట్లు, దుకాణాలు తెరుచుకున్నాయి. విక్రయదారులంతా మాస్కులు, గ్లౌజులు ధరించారు. 65 ఏండ్లకు పైబడిన వారిని వారానికి మూడు రోజులు పనులకు వెళ్లేందుకు అనుమతించారు. జార్జియా, సవన్నాలో జిమ్‌లు, సెలూన్‌లు ఈ వారంలో తెరుచుకొంటాయని గవర్నర్‌ బ్రెయిన్‌ కెంప్‌ ప్రకటించారు. స్పెయిన్‌లో వచ్చే వారం నుంచి చిన్నపిల్లలు బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఫ్రాన్స్‌లో మెక్‌డొనాల్డ్‌ షాపులు తెరుచుకోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

ప్రమాదకరం

వైరస్‌ను కట్టడి చేయకుండా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడమంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదికి వస్తే వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం ఉన్నదన్నారు.


logo