బుధవారం 27 జనవరి 2021
International - Jan 14, 2021 , 02:28:49

ట్రంప్‌ అభిశంసన!

ట్రంప్‌ అభిశంసన!

  • ప్రతినిధుల సభలో మొదలైన ప్రక్రియ
  • తీర్మానానికి మద్దతునిస్తున్న పలువురు రిపబ్లికన్లు

వాషింగ్టన్‌, జనవరి 13: అగ్రరాజ్య రాజకీయం వేడెక్కింది. ట్రంప్‌ను గద్దె దించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడేలా తన మద్దతుదారులను ట్రంప్‌ ఉసిగొల్పారని ఆరోపిస్తూ ఆయనను అభిశంసించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానంపై బుధవారం ప్రతినిధుల సభలో చర్చ ప్రారంభమైంది. అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అంతకుముందు రాజ్యాంగంలోని 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించి ట్రంప్‌ను తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ని కోరుతూ సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే అందుకు తాను సిద్ధంగా లేనని ఉపాధ్యక్షుడు అంతకుముందే స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని డెమోక్రటిక్‌ పార్టీ నిర్ణయించింది. పలువురు రిపబ్లికన్లు కూడా ఈ తీర్మానానికి మద్దతునిస్తున్నారు. 

ట్రంప్‌ పదవిని కోల్పోతారా?

డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభలో తీర్మానానికి సులభంగా ఆమోదం లభించనున్నది. ఈ మేరకు ట్రంప్‌ అభిశంసనకు గురవుతారు. అంతమాత్రాన పదవిని కోల్పోరు. ఆయన మీద వచ్చిన ఆరోపణలపై అనంతరం సెనేట్‌లో విచారణ, ఓటింగ్‌ జరుగుతుంది. సభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ ఓటేస్తేనే ఆయన పదవిని కోల్పోతారు. ప్రస్తుతం సెనేట్‌లో రెండు పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నందున, కనీసం 17 మంది రిపబ్లికన్‌ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తేనే తీర్మానం నెగ్గుతుంది. ట్రంప్‌ మరోసారి పోటీచేయకుండా చూసేందుకు కూడా అభిశంసన తీర్మానం వీలుకల్పిస్తుంది. ట్రంప్‌ పదవి నుంచి దిగిపోయేలోగా ఈ ప్రక్రియ పూర్తికాకపోవచ్చని అంటున్నారు. ఆయన దిగిపోయాక సెనేట్‌లో విచారణ జరిగి, ఆయన దోషిగా తేలితే మరోసారి పోటీచేసేందుకు వీలుండదు.

చంపేస్తామంటూ బెదిరింపులు

 బైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ ఓటు వేసిన చట్టసభ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తంచేశారు. డెమోక్రాట్లతోపాటు ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌ సభ్యులకు కూడా ఈ బెదిరింపులు వస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యాంగ పరిరక్షణే తమ కర్తవ్యమని బలగాలకు గుర్తుచేస్తూ అమెరికా మిలిటరీ ఉన్నతాధికారులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ట్రంప్‌కు మద్దతునిస్తున్న తీవ్రవాద మూకలు హింసకు పాల్పడే ప్రమాదముందన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో వారు ఈ ప్రకటన చేశారు. అమెరికా సైన్యం ఇలాంటి ప్రకటన చేయటం చాలా అరుదు. ఇదే సమయంలో యూట్యూబ్‌ కూడా ట్రంప్‌ చానల్‌ను వారం పాటు నిషేధించింది. 


logo