మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 16, 2020 , 10:41:44

రెమ్‌డిసివిర్‌తో మ‌ర‌ణాలు ఆగ‌లేదు : డ‌బ్ల్యూహెచ్‌వో

రెమ్‌డిసివిర్‌తో మ‌ర‌ణాలు ఆగ‌లేదు : డ‌బ్ల్యూహెచ్‌వో

హైద‌రాబాద్‌:  అమెరికాలో క‌రోనా వైర‌స్ సోకిన వారి కోలుకునేందుకు  రెడ్‌డిసివిర్ వాడుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చికిత్స స‌మ‌యంలో ఈ డ్ర‌గ్ తీసుకున్నారు.  ఇండియాలో కూడా ఈ డ్ర‌గ్‌ను కోవిడ్ పేషెంట్ల‌కు ఇస్తున్నారు. అయితే గిలీడ్ సంస్థ‌కు చెందిన‌ రెమ్‌డిసివిర్‌.. కోవిడ్ పేషెంట్ల‌పై పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ చూప‌లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.  హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న స‌మ‌యాన్ని త‌గ్గించ‌డంలో కానీ,  కోవిడ్ నుంచి మ‌ర‌ణాన్ని ఆపేందుకు రెమ్‌డిసివిర్ ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది.  యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌గా రెమ్‌డిసివిర్‌ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే.  

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిర్వ‌హించిన సాలిడారిటీ ట్ర‌య‌ల్స్‌లో రెమ్‌డిసివిర్ ప్ర‌భావ‌వంతంగా లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, యాంటీ హెచ్ఐవీ డ్ర‌గ్ లోపినావిర్‌-రిటోనావిర్‌, ఇంట‌ర్‌ఫెరాన్ మందుల‌కు కూడా డ‌బ్ల్యూహెచ్‌వో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించింది.  సుమారు 30 దేశాల్లోని 11266 మందికి ఈ మందుల‌తో ప‌రీక్ష‌లు చేశారు.  అయితే రెమ్‌డిసివిర్ వాడ‌కం వ‌ల్ల 28 రోజుల చికిత్స కాల వ్య‌వ‌ధిని త‌గ్గించ‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది.  కానీ త‌మ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో ఇంకా త‌మ సైట్‌లో అప్‌లోడ్ చేయ‌లేదు.  

డ్ర‌గ్స్ ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు రిటోనావిర్ మందుల‌ను ప్ర‌యోగించ‌డం జూన్‌లోనే నిలిపివేసిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. వాస్త‌వానికి రెమ్‌డిసివిర్ వాడ‌వ‌చ్చు అంటూ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) మే ఒక‌టో తేదీన ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి నుంచి ఆ మందును అనేక దేశాలు కోవిడ్ ట్రీట్మెంట్‌లో వినియోగిస్తున్నాయి.


logo