గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 16:17:15

కరోనా: ప్రార్థన సమావేశాలే పాక్‌ సమస్య

కరోనా: ప్రార్థన సమావేశాలే పాక్‌ సమస్య

హైదరాబాద్: కరోనా వైరస్ కరాళనాట్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో నమాజ్ చేసేందుకు మసీదులకు రావద్దు అనే నిబంధనను అమలు చేయలేక పాకిస్థాన్ సతమతమవుతున్నది. మసీదులోకి ఐదుగురికి మించి రావద్దని నామమాత్రంగా నిబంధన ఉన్నప్పటికీ దానిని పాటించేవారే కరువయ్యారు. దాంతో శుక్రవారం పాకిస్థాన్ కరోనా కేసుల సంఖ్య 2,400 దాటింది. ఇప్పటివరకు 35 మందికి పైగా మరణించారు. 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసుల్లో పంజాబ్ 920 కేసులతో అగ్రస్థానంలో నిలువగా 783 కేసులతో సింధ్ రెండో స్థానంలో నిలిచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అతితక్కువగా 9 కేసులు నమోదయ్యాయి. ఓ వారం రోజుల పాటు పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేశారు. కానీ ప్రజలను మసీదులకు రావద్దని, ఇళ్లకే పరిమితం కావాలని ఒప్పించడం అధికారులకు చాలా కష్టమైపోతున్నది. సింధ్ లో శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటలవరకు లాక్‌డౌన్ విధించారు. శుక్రవారం ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో జనం హాజరు కాకుండా నిలువరించేందుకే ఇలా చేశారు. మతపరమైన సంస్థలు కూడా ఇంటిదగ్గరే ప్రార్థనలు చేయొచ్చని ఫత్వాలు జారీచేశాయి. అయినా జనం మసీదులకు  వస్తూనే ఉండడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదిలాఉండగా నయమైన కరోనా రోగుల ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు పాకిస్థాన్ వైద్యులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. చైనా కూడా ఈ ప్రక్రియను ప్రభావయుతంగా వినియోగించిందని పాక్ వైద్య నిపుణుడు తాహిర్ షంసీ తెలిపారు. ప్పంచబ్యాంకు కరోనా ఉపశమన ప్యాకేజీలో భాగంగా పాకిస్థాన్‌కు 20 కోట్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించిందని పాకిస్థాన్ రేడియో తెలిపింది.


logo