ఆదివారం 12 జూలై 2020
International - May 28, 2020 , 02:38:29

‘కొత్త మ్యాప్‌'కు మద్దతివ్వం!

‘కొత్త మ్యాప్‌'కు మద్దతివ్వం!

  • ముందు మా డిమాండ్లు తీర్చండి
  • నేపాల్‌ ప్రధాని ఓలికి  తేల్చి చెప్పిన  ప్రతిపక్షాలు

కాఠ్మండూ: దూకుడుగా వ్యవహరిస్తున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగా ఓ పరిణామం సంభవించింది. కొత్త మ్యాప్‌ బిల్లుపై పట్టుదలగా ఉన్న ఆయనకు మధేశీలు (నేపాల్‌లో స్థిరపడిన భారత మూలాలున్న ప్రజలు), ప్రతిపక్షాలు షాక్‌ ఇచ్చాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు కొత్త మ్యాప్‌ ప్రచురణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. భారత్‌, నేపాల్‌ సరిహద్దులోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్‌ భూభాగంలో కలుపుతూ రూపొందించిన బిల్లును చర్చ కోసం బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు ఆమోదానికి అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి సభలో తగినంత సంఖ్యాబలం లేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్‌ పార్టీతోపాటు మధేశీల పార్టీలు అధికార పక్షానికి షాకిచ్చాయి. సెంట్రల్‌ కమిటీతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. మరోవైపు పౌరసత్వం వంటి తమ డిమాండ్లను తీర్చిన తర్వాతే ఈ బిల్లు గురించి ఆలోచిస్తామని మధేశీలకు చెందిన రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. అలాగే ఈ అంశంపై జాతీయ ఏకాభిప్రాయం కోరాల్సిన అవసరం ఉన్నదని ఇప్పటికే విపక్షాలన్నీ స్పష్టం చేశాయి. దీంతో బుధవారం ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరుగకుండాలనే సభ వాయిదా పడింది. ఈ పరిణామం నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నేపాల్‌ కొత్తగా రూపొందించిన మ్యాప్‌ ప్రచురణ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తున్నది. 


logo