కాఠ్మాండు, మే 28: హాంకాంగ్ పర్వతారోహకురాలు, 44 ఏండ్ల సాంగ్ ఇన్-హుంగ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం 25 గంటల 50 నిమిషాల్లో అధిరోహించారు. ఇప్పటి వరకు మహిళల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఎవరూ ఎవరెస్టును ఎక్కలేదు. శనివారం 1.20 గంటలకు బేస్ క్యాంప్ వద్ద బయలుదేరిన ఆమె 8,848.86 మీటర్ల (29,031 అడుగులు) ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆదివారం సాయంత్రం 3.10 గంటలకు శిఖరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు 39 గంటల 6 నిమిషాల్లో ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాలీ మహిళ ఫుంజో ఝంగ్మూ లామా పేరిట ఉంది.