మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 20, 2020 , 01:59:06

కార్చిచ్చులా వ్యాప్తి.. ప్రమాదంలో లక్షల ప్రాణాలు!

కార్చిచ్చులా వ్యాప్తి.. ప్రమాదంలో లక్షల ప్రాణాలు!

ఐరాస: కరోనా వైరస్‌ వల్ల యావత్‌ ప్రపంచం యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను కార్చిచ్చులా వ్యాప్తి చెందనిస్తే, లక్షల మంది ప్రాణాలను అది హరిస్తుందని హెచ్చరించారు. ‘ఐరాస ఆవిర్భావం తర్వాత 75 ఏండ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం’ అని చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారిపై డిజిటల్‌ వేదికగా మీడియాతో గుటేరస్‌ మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా 3.4 లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ప్రపంచం కోల్పోతుందన్నారు. కరోనా సవాళ్లపై చర్చించేందుకు వచ్చేవారం జీ-20 సభ్య దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించడాన్ని స్వాగతించారు. 

ఆర్బీఐ సిబ్బంది వర్క్‌ ఫ్రం హోం!

దేశంలోకి కరోనా వైరస్‌ శరవేగంగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు తన సిబ్బందికి అనుమతినిచ్చింది. బ్యాంకు లావాదేవీలకు భంగం వాటిల్లకుండా మెజారిటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఆదేశించింది. మొత్తం ఆర్బీఐ పరిదిలో సుమారు 14 వేల మంది పని చేస్తున్నారు. కేంద్ర కార్యాలయం గల ముంబైలో సుమారు నాలుగువేల మంది ఉన్నారు. నగదు మార్పిడి చేసే కరెన్సీ కౌంటర్లు, ఆర్టీజీఎస్‌ విభాగం, ప్రభుత్వ లావాదేవీల విభాగాల సిబ్బంది మాత్రం విధులకు హాజరు కావాలి. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల ఆధీనంలోని సిబ్బంది, కమ్యూనికేషన్ల విభాగం ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. 

వెంటిలేటర్లు, సర్జికల్స్‌ ఎగుమతిపై నిషేధం

 అన్ని రకాల వెంటిలేటర్లు, సర్జికల్‌/ డిస్పోజబుల్‌ మాస్క్‌లు, మాస్కులను తయారు చేసేందుకు ఉపయోగించే ముడి వస్ర్తాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా వైరస్‌ వల్ల దేశంలో నలుగురు మృతి చెందగా, 173 మందికి వ్యాధి సోకిన నేపథ్యంలో తక్షణం వైద్య సంబంధ వస్తు సామగ్రి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంటూ.. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా!

 కరోనా వైరస్‌ నేపథ్యంలో శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 25న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు జరుగాల్సి ఉంది. వైరస్‌ నియంత్రణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నెల 25వ తేదీ తర్వాత ఎన్నికల తేదీని ప్రకటిస్తామని శ్రీలంక ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు మహిందా దేశప్రియ గురువారం మీడియాకు చెప్పారు. రెండు వారాల క్రితం శ్రీలంకలో తొలి కరోనా కేసు నమోదైంది. 50 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించగా, 200 మందికి పైగా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 


logo