శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 03, 2020 , 21:22:41

సోలాపూర్‌ టీచర్‌ రంజిత్‌సిన్హ్‌ డిసాలేకు గ్లోబల్ టీచర్ అవార్డు

సోలాపూర్‌ టీచర్‌ రంజిత్‌సిన్హ్‌ డిసాలేకు గ్లోబల్ టీచర్ అవార్డు

ముంబై : ఈ ఏడాది గ్లోబల్ టీచర్ అవార్డును సోలాపూర్ టీచర్ రంజిత్‌సింగ్ డిసాలే గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు రంజిత్‌సిన్హ్‌ కావడం విశేషం. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 ను గెలుచుకున్న తొలి భారతీయుడైన రంజిత్‌సిన్హ్ డిసాలేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి అభినందించారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి, క్యూఆర్ కోడెడ్ పుస్తకాల ద్వారా విద్యా రంగంలో చేసిన కృషికి డిసాలే ఈ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి 12,000 మంది ఉపాధ్యాయుల నామినేషన్లు అందాయి. వీరిలో నుంచి  మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన 32 ఏండ్ల ఉపాధ్యాయుడు డిసాలే విజేతగా నిలిచారు. బహుమతి కింద రూ.7 కోట్లు గెలుచుకున్న డిసాలే.. ప్రైజ్ మనీలో యాభై శాతం తొమ్మిది మంది ఫైనలిస్టులకు పంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం 9 దేశాల్లోని వేలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడుతుందని డిసాలే భావిస్తున్నారు.

“సోలాపూర్ జిల్లాలోని పరితేవాడిలోని జడ్‌పీ పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సిన్హ్‌ డిసాలేకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలలో విద్య గురించి ఆసక్తిని కలిగించే కృషిచేయడం ప్రశంసనీయం. డిసాలేను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఉపాధ్యాయులు పనిచేస్తారని భావిస్తున్నాను” అని గవర్నర్‌ కోష్యారీ తన అభినందన లేఖలో పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo