శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 02:30:10

శ్రీలంక ప్రధానిగా మళ్లీ రాజపక్స

శ్రీలంక ప్రధానిగా మళ్లీ రాజపక్స

  • పార్లమెంట్‌ ఎన్నికల్లో జయభేరి
  • మూడింట రెండొంతుల మెజార్టీ

కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) జయభేరి మోగించింది. ఏకంగా మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకున్నది. 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంట్‌లో ఎస్‌ఎల్‌పీపీ 145 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య150కి చేరుతుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఎన్నికలు బుధవారం పూర్తికాగా.. ఎన్నికల సంఘం శుక్రవారం ఫలితాలను ప్రకటించింది. తమపై సంపూర్ణ విశ్వాసం కనబరిచినందుకు శ్రీలంక ప్రజలకు రాజపక్స ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన నాలుగోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే సారథ్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీ కేవలం ఒకేఒక సీటును గెలుచుకున్నది. రణిల్‌ విక్రమ్‌సింఘే 1977 తర్వాత తొలిసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. యూఎన్‌పీ నుంచి వేరుపడి సొంతపార్టీ పెట్టుకున్న సాజిత్‌ ప్రేమదాస్‌ 55 స్థానాలను కైవసం చేసుకుని రెండోస్థానంలో నిలిచారు.


logo