సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 11:07:33

స్త్రీ, పురుషుల క‌ల‌యికే పెళ్లి.. రష్యా రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు

స్త్రీ, పురుషుల క‌ల‌యికే పెళ్లి.. రష్యా రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు

హైద‌రాబాద్‌:  ర‌ష్యా త‌న రాజ్యాంగంలో మార్పులు చేయ‌నున్న‌ది.  స్త్రీ, పురుషుల మ‌ధ్య జ‌రిగే సంగ‌మాన్ని మాత్ర‌మే పెళ్లిగా గుర్తించ‌నున్న‌ట్లు ర‌ష్యా త‌న రాజ్యాంగంలో కొత్త స‌వ‌ర‌ణ తీసుకురానున్న‌ది.  అలాగే దేవుడు అన్న ప‌దాన్ని కూడా కొత్త స‌వ‌ర‌ణ‌ల‌తో రాజ్యాంగంలో చేర్చ‌నున్న‌ది.  అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మార్పులు తీసుకురానున్నారు.  గ‌త నెల‌లోనే ర‌ష్యా పార్ల‌మెంట్ ఈ మార్పుల‌కు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తం 24 పేజీల స‌వ‌ర‌ణ‌ల‌ను పుతిన్‌.. పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాతే ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు స్పీక‌ర్ వ‌చ‌స్లేవ్ వోలోడిన్ తెలిపారు.  

దేవుడిపై విశ్వాసం ఉంద‌న్న స‌వ‌ర‌ణ‌ను రాజ్యాంగంలో చేర్చ‌నున్న‌ట్లు డిప్యూటీ స్పీక‌ర్ పోట‌ర్ టాల్స్‌టాయ్ తెలిపారు. మ్యారేజ్‌ను కూడా హెటిరోసెక్సువ‌ల్ యూనియ‌న్‌గా గుర్తించిన‌ట్లు చెప్పారు.  స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌ను చ‌ట్ట‌బ‌ద్దం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఇటీవ‌ల పుతిన్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.  అమ్మ‌, నాన్న అన్న సాంప్ర‌దాయ ప‌ద్ద‌తుల‌ను పేరెంట్ నెంబ‌ర్ వ‌న్‌, పేరెంట్ నెంబ‌ర్ 2తో పోల్చ‌లేమ‌ని పుతిన్ అన్నారు.  ర‌ష్యా చ‌ట్టం ప్ర‌కారం.. కేవ‌లం హెటిరోసెక్సువ‌ల్ దంప‌తులు మాత్ర‌మే పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకునే వీలు ఉంది.  రష్యాలో ఎక్కువ శాతం సాంప్ర‌దాయ క్రిస్టియ‌న్లు ఉన్నారు. కానీ ఆ దేశం సెక్యుల‌ర్ కూడా. రాజ్యాంగ సంస్క‌ర‌ణల బిల్లుపై మార్చి 10న రెండ‌వ‌సారి చ‌ర్చించ‌నున్నారు. ఏప్రిల్ 22న ఓటింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.  


logo