శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 24, 2020 , 03:45:12

ప్రచండ చేతికి పార్టీ పగ్గాలు

ప్రచండ చేతికి పార్టీ పగ్గాలు

  •  నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక
  • ఓలీపై క్రమశిక్షణ చర్యలకు పార్టీ నిర్ణయం 

కాఠ్మాండూ: నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేపీ శర్మ ఓలీ పదవి నుంచి దిగిపోయారు. ప్రచండ నేతృత్వంలోని పార్టీ సెంట్రల్‌ కమిటీ మంగళవారం భేటీ అయింది. పార్లమెంటును రద్దు చేసినందుకు ఓలీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు. పార్లమెంటును రద్దు చేయాలన్న ఓలీ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన అన్ని రిట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. శుక్రవారం నుంచి ఈ పిటిషన్లపై విచారణ జరుగనుంది. 

అంతర్గత విభేదాల వల్లే సంక్షోభం

నేపాల్‌లో 2018లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూఎంఎల్‌), ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు పార్టీలు కలిసి నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీగా ఏర్పడ్డాయి. ఓలీ రెండున్నరేండ్లు ప్రధానిగా పనిచేశాక ప్రచండ ఆ పదవిని స్వీకరించాలని, లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి ఒకరికి, ప్రధాని పదవి ఒకరి కోసం అన్న ఒప్పందం కుదిరింది. అయితే ఓలీ జాతీయవాద రాజకీయాలు చేయాలన్న తలంపుతో తన మాటను నిలబెట్టుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

58 ఏండ్లలో 49 మంది ప్రధానులు

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొత్తేమీ కాదు. గత 58 ఏండ్లలో 49 మంది ప్రధానులు మారారంటే అక్కడ రాజకీయ అనిశ్చితి ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియ కూడా నేపాల్‌లో రాజకీయ అనిశ్చితికి కారణం అవుతున్నది.  


logo