బుధవారం 03 మార్చి 2021
International - Feb 23, 2021 , 16:08:04

ఆరు కాళ్లు, రెండు తోక‌ల‌తో వింత కుక్క‌పిల్ల‌! ..వీడియో

ఆరు కాళ్లు, రెండు తోక‌ల‌తో వింత కుక్క‌పిల్ల‌! ..వీడియో

వాషింగ్ట‌న్‌: సాధార‌ణంగా కుక్క‌ల‌కు నాలుగు కాళ్లు, ఒక తోక ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా గ‌త ‌వారం అమెరికాలోని ఓక్ల‌హామాలో జ‌న్మించిన ఓ ఆడ‌ కుక్కపిల్ల‌కు మాత్రం ఆరు కాళ్లు, రెండు తోక‌లు ఉన్నాయి. వింతగా జ‌న్మించిన ఈ కుక్కపిల్ల బ‌తికే ఉంది. ఇత‌ర కుక్కపిల్ల‌ల మాదిరిగానే ఆరోగ్యంగా, బ‌లంగా కూడా ఉన్న‌ది. బార్డ‌ర్ కోలి, ఆస్ట్రేలియ‌న్ షెప‌ర్డ్ జాతి కుక్క‌ల సంక‌రంతో ఈ కుక్క‌పిల్ల జ‌న్మించిందని దానికి పురుడు పోసిన ఆస్ప‌త్రి  వైద్యులు తెలిపారు.  

ఈ వింత కుక్క‌పిల్ల అమెరికాలోని ఓక్ల‌హామా రాష్ట్రంలోగ‌ల నీల్ వెట‌ర్న‌రీ ఆస్ప‌త్రిలో జ‌న్మించింది. ఒక కుక్క‌పిల్ల ఆరు కాళ్ల‌తో జ‌న్మించి ప్రాణాల‌తో ఉండ‌టం ఇదే మొద‌టిసారని ఆ ఆస్ప‌త్రి వైద్యులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. ఈ కుక్క‌పిల్ల జ‌న్మించి నాలుగు రోజులైంద‌ని, గ‌తంలో ఇలా వింత‌గా జ‌న్మించిన ఏ కుక్కపిల్ల‌ కూడా నాలుగు రోజులపాటు బ‌తికిలేద‌ని వారు వెల్ల‌డించారు. తాను ఇలాంటి వింత కుక్క‌ను గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని, భ‌విష్య‌త్తులో కూడా చూస్తాన‌నుకోవ‌డం లేద‌ని నీల్ ఆస్ప‌త్రి వైద్యురాలు ఎలిస‌న్ ఎవ‌రెట్ చెప్పారు. దానికి నాలుగు వెనుక కాళ్లు, రెండు ముందు కాళ్లు, రెండు తోక‌లు ఉన్నాయ‌ని తెలిపారు. 

ఈ కుక్క‌పిల్ల‌కు పుట్టుక‌తో వ‌చ్చే రెండు ర‌కాల రుగ్మ‌త‌లు ఉన్నాయ‌ని వైద్యులు తెలిపారు. వాటిలో ఒక‌టి మోనోసెఫాల‌స్ డైపైగ‌స్ అని‌, రెండోది మోనోసెఫాల‌స్ రాచిపాగ‌స్ డైబ్రాచియ‌స్ టెట్రాప‌స్ అని చెప్పారు‌. అంటే ఒకే కుక్క‌పిల్ల‌కు ఒక త‌ల‌, ఒక ఉరఃకుహ‌రం ఉండి.. రెండు పాయురంధ్రాలు, రెండు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లు, రెండు మూత్ర మార్గాలు ఉన్నాయ‌ని అర్థ‌మ‌ని వారు వివ‌రించారు.

ఈ కుక్క కూన‌లోని అన్ని అవ‌య‌వాలు ఇత‌ర కుక్క‌ల అవ‌య‌వాల్లాగే బ‌లంగా ఉన్నాయ‌ని, ఇత‌ర కుక్క పిల్ల‌ల మాదిరిగానే మ‌ల‌, మూత్ర విస‌ర్జ‌న‌లు చేస్తున్న‌ద‌ని చెప్పారు. అన్ని అవ‌య‌వాల క‌ద‌లిక‌లు కూడా సాధార‌ణంగానే ఉన్నాయ‌న్నారు. అయితే ఈ కూన‌కు కొంచెం ఫిజిక‌ల్ థెర‌పీ, శ‌స్త్ర‌చికిత్స‌లు అవ‌సర‌మ‌ని, కొంత వ‌య‌సు పెరిగిన త‌ర్వాత స‌ర్జరీ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. స‌ర్జ‌రీ కోసం ఆ కుక్క‌పిల్ల య‌జ‌మాని విరాళాలు కూడా సేక‌రిస్తున్నాడ‌ని వెల్ల‌డించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo