శుక్రవారం 03 జూలై 2020
International - May 30, 2020 , 15:41:56

ఎలాన్‌మస్క్‌ ప్రయోగంలో అపశృతి

ఎలాన్‌మస్క్‌ ప్రయోగంలో అపశృతి

టెక్సాస్‌: అంతరిక్షంలోకి యాత్రికులను తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌మస్క్‌ ప్రయోగంలో అపశృతి దొర్లింది. దక్షిణ టెక్సాస్‌లోని ఎలాన్‌మస్క్‌ స్పేస్‌ సెంటర్‌లో గ్రౌండ్ పరీక్షల సమయంలో స్పేస్‌ ఎక్స్‌ రాబోయే హెవీ లిఫ్ట్‌ రాకెట్‌ స్టార్‌షిప్‌ యొక్క నమూనా శుక్రవారం రాత్రి పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నమూనా పూర్తిగా దగ్ధమై బూడిదై పోయింది. అయితే, కెన్నెడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న నాసా రాకెట్‌ వ్యవస్థకు దీనితో ఎలాంటి సంబంధం లేదు.

అంతరిక్షంలో ఇద్దరు వ్యోమగాములను పంపేందుకు ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం వాతావరణం అనుకూలించపోవడం వల్ల అర్థాంతరంగా నిలిచిపోయింది. ఫాల్కన్‌ 9 క్రూ డ్రాగన్‌ను కూడా సిద్ధం చేశారు. నాసా స్పేస్‌ ఫ్లైట్‌ వెబ్‌సైట్‌లో పేలుడుకు సంబంధించిన వీడియా రికార్డయింది. ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఈ పేలుడుపై స్పేస్‌ ఎక్స్‌ ఇంతవరకు స్పందించలేదు. 394 అడుగుల పొడవున్న స్టార్‌షిప్‌.. మనుషులతోపాటు 100 టన్నుల వరకు సరుకును చంద్రుడు, అంగారక గ్రహం మీదికి తీసుకెళ్లేందుకు వీలుగా రూపొందించారు. దీన్ని పునర్వినియోగించుకొనేలా తయారుచేశారు. అంతరిక్ష ప్రయాణాన్ని మనుషులకు సరసమైనదిగా చేయాలన్న లక్ష్యంతో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ గత కొన్నాళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. సరుకులు, మానవులను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు రాకెట్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు స్సేస్‌ ఎక్స్‌తోపాటు మరో రెండు ప్రధాన సంస్థలకు నాసా బిలియన్‌ డాలర్ల విలువైన పనిని అప్పగించింది. అవార్డు పొందేందుకు స్టార్‌షిప్‌ను నాసాకు స్పేస్‌ ఎక్స్‌ ప్రతిపాదనలు చేసింది.


logo