శనివారం 11 జూలై 2020
International - May 31, 2020 , 02:30:28

ఫ్లాయిడ్‌ను చంపిన పోలీస్‌పై హత్యకేసు

ఫ్లాయిడ్‌ను చంపిన పోలీస్‌పై హత్యకేసు

 • రగులుతున్న అమెరికా
 • ఫ్లాయిడ్‌ హత్యపై భగ్గుమన్న నల్లజాతీయులు
 • దేశమంతా విస్తరించిన నిరసనలు.. ఆస్తుల ధ్వంసం
 • డెట్రాయిట్‌లో పోలీసుల కాల్పులు.. వ్యక్తి మృతి
 • సైన్యాన్ని రంగంలోకి దించే అవకాశం!
 • ఫ్లాయిడ్‌ హత్యపై కొనసాగుతున్న నల్లజాతీయుల నిరసనలు
  • దేశమంతా విస్తరణ.. ఆస్తుల ధ్వంసం
  • డెట్రాయిట్‌లో కాల్పులు.. వ్యక్తి మృతి
  • సైన్యాన్ని రంగంలోకి దించే అవకాశం!

  అమెరికాలో జాత్యహంకారంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. తరతరాల దాష్టీకంపై తిరుగుబాటు అగ్నిజ్వాలలై రగులుతున్నది. ఊరూవాడా ఏకమై న్యాయంకోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నది. కొద్దిరోజుల క్రితం మిన్నెపొలిస్‌లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు అమానుషంగా హత్యచేయటంపై ఆఫ్రికన్‌ అమెరికన్‌ జాతీయుల ఉద్యమం అమెరికా మొత్తం దావానలంలా చుట్టుకున్నది. వేలమంది ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి ఆస్తులను ధ్వంసంచేసి పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. 

  వాషింగ్టన్‌, మే 30: అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల ఆగ్రహ జ్వాల కొనసాగుతున్నది. కొద్దిరోజుల కిందట మిన్నెపొలిస్‌లో పోలీసు అధి కారి చేతిలో దారుణంగా హత్యకు గురైన జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ మొదలైన ఉద్యమం అమెరికా అంతటా విస్తరించింది. మిన్నెపొలిస్‌లో శనివారం నాటికి ఆందోళన అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించి, నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితి మారలేదు. విధ్వంసకాండ శనివారం దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. డెట్రాయిట్‌లో పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌ పోలీసులను శిక్షించండి.. జాత్యహంకార హత్యలను ఇక ఆపండి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో వందలమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అట్లాంటాలో నిరసనకారులు పోలీసు కార్లను ధ్వంసం చేశారు. సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ ప్రధాన కార్యాలయంపై దాడిచేశారు. న్యూయార్క్‌లో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నది.


  పరిస్థితిని అదుపుచేసేంత సంఖ్యలో భద్రతా సిబ్బంది తమవద్ద లేరని మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ చేతులెత్తేశారు. నిరసనకారులను అరెస్టుచేస్తే పరిస్థితి మరింత విషమించొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మిన్నెపొలిస్‌, సెయింట్‌పాల్‌ నగరాలు తగలబడుతున్నాయి. నగరంలో మిగిలిన బూడిద కొన్ని తరాలు దశాబ్దాలనుంచి భరిస్తున్న నొప్పి, పడుతున్న వేదనకు చిహ్నం. దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. నిరసనలను అదుపు చేసేందుకు అవరసమైతే ఆర్మీని దించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీకి ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీస్‌ పోలీస్‌ డెరెక్‌ చౌవిన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తున్నది.  కాగా అమాయకుడిని అన్యాయంగా చంపిన డెరెక్‌తో కలిసి జీవించలేనంటూ ఆయన భార్య విడాకులకు దరఖాస్తు చేశారు.

  రంగంలోకి సైన్యం..?


  నల్లజాతీయుల ఆందోళన దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తుండటంతో సైన్యాన్ని రంగంలోకి దించాలని ఫెడరల్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టు కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఏ క్షణంలో అయినా ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశిలిచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపాలని నల్లజాతీయుల దివంగత ఉద్యమ నాయకుడు మార్టిన్‌ లూథర్‌కింగ్‌ చిన్న కూతురు బెర్నైస్‌ కింగ్‌ ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. రోడ్లను ఖాళీచేసి ఇండ్లకు వెళ్లాలని శనివారం ఆమె సూచించారు.

  నా రెస్టారెంట్‌ తగలబెట్టినా సరే.. ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలిగాంధీ మహల్‌ యజమాని హఫ్సా

  మిన్నెపొలిస్‌లో ఆందోళనకారులు గాంధీ మహ ల్‌ అనే భారతీయ రెస్టారెంటుకు గురువారం రాత్రి నిప్పంటించారు. అయితే ఆ రెస్టారెంట్‌ యజమాని మాత్రం నిరసనకారులను నిందించలేదు. బాధితుడికి న్యాయం జరిగితే చాలు అని ప్రకటించటం ఇప్పుడు అమెరికాలో వైరల్‌ అవుతున్నది. ‘నా రెస్టారెంట్‌ను తగులబెట్టినా నేను మళ్లీ నిర్మించుకుంటా. కానీ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలి. పోలీసులకు శిక్ష పడాలి’ అని  రెస్టారెంట యజమాని హఫ్సా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 


  logo