ఆదివారం 12 జూలై 2020
International - Jun 28, 2020 , 21:29:06

క్వెట్టా, బెర్లిన్‌లో నిరసనలు

క్వెట్టా, బెర్లిన్‌లో నిరసనలు

బెర్లిన్‌ / క్వెట్టా : బలూచ్‌ రాజకీయ నాయకులు, మేధావులను పాకిస్తాన్‌ నిఘావర్గాలు అక్రమంగా అపహరించడాన్ని నిరసిస్తూ ఆదివారం బలూచిస్తాన్‌తో పాటు జర్మనీలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బలూచిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో, అపహరణకు గురైన డాక్టర్ డీన్ మహమ్మద్ బలూచ్‌, డాక్టర్ అక్బర్ మర్రిలను విడుదల చేయాలని ప్రభుత్వేతర సంస్థ వాయిస్ ఫర్ బలూచ్‌ మిస్సింగ్ పర్సన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. 11 సంవత్సరాల కిందట డాక్టర్‌ డీన్‌ మహమ్మద్‌ బలూచ్‌ అపహరణకు గుర్తుగా నిరసనగా వందలాది మంది క్వెట్టాలో వీధుల్లో గుమిగూడారు. డీన్ మహ్మద్ కుమార్తె సమీ, మెహలాబ్ దీన్‌తో పాటు బలూచ్ మహిళలు, పురుషులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. డీన్‌ జాన్‌, అక్బర్‌ మర్రిలతో మిగతా వారిని వెంటనే విడుదల చేయాలని నిరసన కారులు డిమాండ్‌ చేశారు.

అలాగే జర్మనీలోని బెర్లిన్‌లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాక్‌ ప్రభుత్వ సంస్థలు అపహరించిన, అణచివేత, మానవహక్కుల ఉల్లంఘనల అంశాన్ని నిరసన కారులు లేవనెత్తారు. బలూచ్‌ జాతీయ ఉద్యమం తరఫున ప్రదర్శనలకు నాయకత్వం వహించిన అస్ఘర్ బలూచ్, దోస్తీన్ బలూచ్, అలీ బలూచ్‌ మాట్లాడుతూ బలూచ్‌ ప్రజలు 27 మార్చి, 1948 నుంచి మానవ హక్కుల ఉల్లంఘనను ఎదుర్కొంటున్నారని, అనాగరికం ఇంకా కొనసాగుతుందని ఆరోపించారు. వెంటనే వైద్యులతో పాటు, ఆచూకీ లేకుండాపోయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్ డీన్ జాన్ విడుదల కోసం మేం ఎన్నో ప్రయత్నాలు చేశామని, నేటి ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్రచారం ఆ ప్రయత్నాల్లో ఒకటని అస్ఘర్ తెలిపారు. 


logo