బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 09:48:09

పాక్‌, చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసన

పాక్‌, చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసన

ముజఫరాబాద్‌ : నీలం-జీలం నదిపై చైనా సంస్థలు నిర్మించనున్న మెగా డ్యామ్‌లను వ్యతిరేకిస్తూ  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లోని ముజఫరాబాద్‌లో సోమవారం రాత్రి భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ‘దర్యా బచావో.. ముజఫరాబాద్‌ బచావో’ (సేవ్‌ రివర్‌.. సేవ్‌ ముజఫరాబాద్‌).. నీలం-జీలం బహ్నే దో.. హుమీన్‌ జిందా రెహ్నేదో’ (నీలం-జీలం నదులు ప్రవహించనివ్వండి.. మమ్మల్ని బతకనివ్వండి) అంటూ నినాదాలు చేస్తూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో సుమారు వెయ్యి మందికిపైగా పీవోకేలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆజాద్ పట్టాన్, కోహలా హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పాకిస్థాన్, చైనాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా 700.7 మెగావాట్ల సామర్థ్యం గల ఆజాద్‌ పటాన్‌ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ఏడాది జూలై 6న ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టులకు 1.54 బిలియన్లు చైనాకు చెందిన గెజౌబా గ్రూప్ కంపెనీ (సీజీజీసీ) సమకూర్చనుంది. జీలం నదిపై నిర్మించతలపెట్టిన కోహలా జలవిద్యుత్ ప్రాజెక్టు, పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుధానోతి జిల్లాలో ఆజాద్ పట్టాన్ వంతెనకు సుమారు 7 కిలోమీటర్ల ఎగువ ప్రవాహంలో ఉంది. 2026 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు చైనా త్రీ గోర్జెస్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్ సీ), సిల్క్ రోడ్ ఫం‌డ్‌ల ద్వారా స్పాన్సర్ చేయనుంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో చైనా ఉనికి, భారీ ఆనకట్టల నిర్మాణం, నదీ మళ్లింపు వారి ఉనికికి ముప్పుగా భావిస్తున్నారు. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నేపథ్యంలో పాక్, చైనా సంయుక్తంగా పీవోకే, గిల్గిట్‌, బాల్టిస్థాన్‌ల సహజ వనరులను కొల్లగొట్టాయి. దీంతో పాక్‌, చైనాలపై పీవోకే భూభాగంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo