ఆదివారం 12 జూలై 2020
International - Jun 11, 2020 , 16:29:16

క్రిస్టోఫర్‌ కొలంబస్‌పై.. నేటివ్‌ అమెరికన్ల ఆగ్రహం

క్రిస్టోఫర్‌ కొలంబస్‌పై.. నేటివ్‌ అమెరికన్ల ఆగ్రహం

హైదరాబాద్‌: అమెరికాలోని మిన్నసొట్టాలో ఉన్న క్రిస్టోఫర్‌ కొలంబస్‌ విగ్రహాన్ని ఆందోళనకారులు కూల్చివేశారు.  రెండు రోజుల క్రితం నిరసనకారులు.. వర్జీనియాలోని ఓ పార్క్‌లో ఉన్న కొలంబస్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి సమీప సరస్సులో పడేసిన విషయం తెలిసిందే. పోలీసుల అకృత్యాలు, వర్ణవివక్ష దాడులకు వ్యతిరేకంగా నేటివ్‌ అమెరికన్లు ఉద్యమిస్తున్నారు.  ఇటీవల జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు అత్యంత దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో.. అమెరికా అంతటా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 

ఇటలీ నావికుడైన కొలంబస్‌.. అమెరికాను కనుగొన్న విషయం తెలిసిందే. అయితే కొలంబస్‌ చేపట్టిన అన్వేషణ వల్లే.. నేటివ్‌ అమెరికన్ల ఊచతకోత జరుగుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.  కొలంబస్‌ వచ్చిన తర్వాత అమెరికాలో యురోపియన్‌ కాలనీలు మొదలయ్యాయని, దాంతో తమ పూర్వీకుల ఊచకోత మొదలైనట్లు స్థానిక తెగలకు చెందిన నల్లజాతీయులు ఆరోపిస్తున్నారు. తాజాగా మిన్నసొట్టాలో 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూల్చివేశారు. గ్రానైట్‌ బేస్‌పై ఉన్న ఆ విగ్రహాన్ని డజన్ల సంఖ్యలో ఆందోళనకారులు కిందకు గుంజిపడేశారు. ఇదే సరైన సమయం అని, ఇదే సరైన చర్య అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. 

మిన్నసొట్ట రాష్ట్ర రాజధానిలో ఉన్న కొలంబస్‌ విగ్రహన్ని.. కార్లో బ్రియోశ్చి అనే శిల్ప తయారు చేశాడు. దీన్ని 1931లో అతను ఈ నగరానికి అంకితం ఇచ్చాడు. 1861-65 మధ్య కాలంలో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. ఆ సమయంలో నల్లజాతీయుల్ని బానిసలుగా వాడిన నేతల విగ్రహాలను ప్రస్తుత ఆందోళనకారులు ఊల్చివేస్తున్నారు. కాన్ఫిడరేట్‌ నేత స్మారక స్థూపాలను ధ్వంసం చేస్తున్న తీరుపై కొందరు శ్వేతజాతి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిన్నసొట్టతో పాటు బోస్టన్‌, మసాచుసెట్స్‌, మియామిల్లో ఉన్న కొలంబస్‌ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు.  15వ శతాబ్ధంలో అమెరికాను కనుగొన్న వీరుడిగా కొలంబస్‌ను కీర్తించారు. అమెరికా పాఠ్య పుస్తకాల్లోనూ అతని గురించి పాఠాలు ఉన్నాయి. కానీ నేటివ్‌ అమెరికన్లు మాత్రం కొలంబస్‌ సముద్ర అన్వేషణను వ్యతిరేకించారు.  కొలంబస్‌ వల్ల తమ పూర్వీకులు అంతమైనట్లు నేటివ్‌ అమెరికన్లు ఆరోపిస్తున్నారు. 


logo