పలు దేశాల్లో కొద్దిసేపు పనిచేయని కంపెనీల వెబ్సైట్లు
హాంకాంగ్, జూన్ 17: ప్రపంచవ్యాప్తంగా గురువారం పలుమార్లు ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు దేశాల్లో ఆర్థిక సంస్థలు, కంపెనీలు, ఎయిర్లైన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాటి వెబ్సైట్లు పనిచేయలేదు. తమ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు హాంకాంగ్ స్టాక్ ఎక్చేంజ్ ట్వీట్ చేసింది. తర్వాత 17 నిమిషాలకు వెబ్సైట్ తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్టు మరో ట్వీట్లో తెలిపింది. గురువారం అనేకసార్లు ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం కలిగినట్టు ఇంటర్నెట్ పర్యవేక్షణ వెబ్సైట్లు Downdetector.com, fing.com తెలిపాయి. అమెరికా ఎయిర్లైన్స్ వెబ్సైట్లలోనూ సమస్యలు వచ్చినట్టు పేర్కొన్నాయి. బ్యాంకింగ్, విమానాల టికెట్లు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆస్ట్రేలియాలో కొంత మంది చెప్పారు. బ్యాంకింగ్ సేవల్లో తీవ్ర జాప్యం జరిగినట్టు ఆస్ట్రేలియా పోస్ట్ తెలిపింది. దీనికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తామని ఆస్ట్రేలియా తెలిపింది.