శనివారం 28 నవంబర్ 2020
International - Nov 21, 2020 , 01:38:58

బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతికి ఊరట

బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతికి ఊరట

  • క్యాబినెట్‌లో కొనసాగిస్తున్నట్టు 
  •    ప్రకటించిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌
  • అధికారితో దురుసుగా ప్రవర్తించారంటూ
  •   ప్రీతిపై ఆరోపణలు.. దోషిగా నిర్ధారణ
  • అయినప్పటికీ, ఆమెకు మద్దతు తెలిపిన బోరిస్‌

లండన్‌: మినిస్టీరియల్‌ కోడ్‌ (మంత్రుల కోడ్‌)ను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ హోంమంత్రి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ (48)కు ఊరట లభించింది. ఆమెను మంత్రిగా కొనసాగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం వెల్లడించారు. అంతర్గత మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఫిలిప్‌ రుత్నమ్‌ అనే ఉన్నతాధికారితో గత మార్చిలో ప్రీతి దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్టు అంతర్గత విచారణలో రుజువైంది. అధికారులతో మంత్రులు ఇలా ప్రవర్తిస్తే, మినిస్టీరియల్‌ కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆనవాయితీ ప్రకారం మినిస్టీరియల్‌ కోడ్‌ను ఉల్లంఘించిన మంత్రి.. తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే మంత్రుల రాజీనామాపై అంతిమ నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ప్రధానికి మాత్రమే ఉంటుంది. ప్రీతిపై తనకు పూర్తి నమ్మకమున్నదని, ఆమెకు తన మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్న బోరిస్‌.. ఆమెను హోంమంత్రిగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. బోరిస్‌ నిర్ణయంతో మినిస్టీరియల్‌ కోడ్‌కు స్వతంత్ర సలహాదారుగా పనిచేస్తున్న అలెక్స్‌ అలన్‌ విభేదించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.