లండన్: వేల్స్ యువరాణి డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును మంగళవారం వేలం వేశారు. డయానాకు ఆ కారును ప్రిన్స్ చార్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు. 1981, మే నెలలో వారి వివాహానికి ముందు డయానాకు ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును బహూకరించారు. వేలంలో ఆ కారు 50 వేల పౌండ్స్‌కు పైగా ధర పలికింది. అంటే సుమారు 69,200 అమెరికన్ డాలర్లు, 58,100 యూరోలు. మన కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షలకు పైమాటే. దక్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియన్ ఆ కారును కొనుగోలు చేశాడు.
ప్రిన్సెస్ డయానా 1961 లో జన్మించింది. 1981లో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. వివాహానికి రెండు నెలల ముందు 1981 మే నెలలో ప్రిన్సెస్ డయానాకు ఫోర్డ్ ఎస్కార్ట్ ఘియా సలోన్ కారును ఎంగేజ్మెంట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారును నిన్న (జూన్ 29న) ఎసెక్స్‌లో వేలంవేశారు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది.
ఆ కారును గత 20 ఏండ్లుగా ఉపయోగించనప్పటికీ అది ఇప్పటికీ రాయల్ గ్యారేజ్‌లో మంచి స్థితిలోనే ఉందట. ఆ కారు అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ WEV 297W ప్లేట్ ఇప్పటికి అలాగే ఉందట. కారులోని మీటర్ ప్రకారం.. ఈ కారు 83,000 మైళ్ళు ప్రయాణించింది. అంటే ఇది దాదాపుగా 1,33,575 కిలోమీటర్లు ప్రయాణించింది. కారులో అమర్చిన 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్పీఎమ్ వద్ద 78 బీహెచ్పీ పవర్, 3,000 ఆర్పీఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందట. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుందట.