శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 21, 2020 , 02:45:40

విడిపోక తప్పలేదు

విడిపోక తప్పలేదు
  • ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తరువాతే నిర్ణయం తీసుకున్నా
  • రాజకుటుంబం నుంచి విడిపోవడంపై ప్రిన్స్‌ హ్యారీ వెల్లడి

లండన్‌: రాజకుటుంబం నుంచి విడిపోవడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని ఎలిజబెత్‌ రాణి మనుమడు, బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్‌ హ్యారీ పేర్కొన్నారు. అనేక సంవత్సరాల పాటు సవాళ్లు ఎదుర్కొన్న తరువాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన తరువాత ఆదివారం రాత్రి మొదటిసారిగా ప్రిన్స్‌ హ్యారీ ఒక ప్రకటన విడుదల చేశారు. మెఘాన్‌ మార్కెల్‌తో వివాహం అనంతరం తామిద్దరం ఎంతో ఉత్సాహంతో భవిష్యత్‌ గురించి కలలు కన్నామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కుటుంబం నుంచి విడిపోతున్నందుకు ఎంతో విచారంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌ ఎప్పుడూ తన ఇల్లుగానే ఉంటుందన్నారు.

 హ్యారీ, మెఘాన్‌ జంట కెనడా, బ్రిటన్‌ మధ్య తమ సమయాన్ని గడుపుతామని వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజకుటుంబం నుంచి విడిపోయిన నేపథ్యంలో హ్యారీ మెఘాన్‌ జంట తమ పేర్ల ముందు హిస్‌ హైనెస్‌ అనే బిరుదును కోల్పోతారు. ప్రభుత్వం నుంచి రాజకుటుంబానికి లభించే నిధులలో వాటాను కోల్పోతారు. ‘నేను రాజకుటుంబంలో పుట్టాను, నా దేశానికి, మహారాణికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మీకు సేవ చేయడం మా ధన్యత, ఈ సేవా జీవితాన్ని కొనసాగిస్తాము’ అని సెంటెబేల్‌ చారిటీ సంస్థ ఏర్పాటు చేసిన విందులో హ్యారీ చెప్పారు. ‘23ఏండ్ల క్రితం నా తల్లి ప్రిన్సెస్‌ డయానా కారు ప్రమాదంలో మరణించినప్పుడు మీరంతా నన్ను మీ రెక్కల కిందికి చేర్చుకున్నారు. ఇంతకాలం నన్ను ఆదరించారు’ అంటూ ప్రిన్స్‌ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. logo