శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 07:29:35

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థుల తొలి ముఖాముఖి

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థుల తొలి ముఖాముఖి

న్యూయార్క్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాటిక్ అభ్య‌ర్థి జో బైడెన్ మ‌ధ్య మొద‌టిసారిగా ముఖాముఖి చ‌ర్చ ప్రారంభ‌మైంది. అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష‌ చ‌ర్చ ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఈనేప‌థ్యంలో వివిధ అంశాల‌పై ఇరువురు అభ్య‌ర్థులు త‌మ వాద‌న వినిపిస్తున్నారు. ఈ చ‌ర్చ‌ 90 నిమిషాల‌పాటు జ‌రుగ‌నుంది. ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య అమెరికా అధ్య‌క్ష చ‌ర్చ సంధాన‌క‌ర్త‌గా క్రిస్ వాలెస్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

న్యాయ‌మూర్తుల ఎంపిక‌లో ఇటీవ‌ల వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌పై క్రిస్ వాలెస్ మొద‌టి ప్ర‌శ్న అడిగారు. కాగా, అమెరికాలో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, వేలాదిమంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నార‌ని జో బైడెన్ అన్నారు. ఒబామా కేర్‌ను ర‌ద్దు చేసి, ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఆరోగ్య బీమా ప‌థ‌కంపై ఇరువురు నేత‌లు త‌మ వాద‌న వినిపించారు. ఒబామా కేర్‌ను ర‌ద్దు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ్డార‌ని, వేలాదిమంది ప్రాణాలు కోల్పోయార‌ని బైడెన్ విమ‌ర్శించారు. క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డంతో ట్రంప్ విఫ‌ల‌మ‌య్యార‌న్నారు. క‌రోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ మాట‌లు నమ్మేలా లేవ‌ని విమ‌ర్శించారు. వైద్య‌, ఆరోగ్య రంగంపై ట్రంప్‌కు ఎలాంటి ప్ర‌ణాళిక లేద‌న్నారు. క‌రోనా దృష్ట్యా పాఠ‌శాల‌లు తెర‌వ‌డం స‌రికాద‌న్నారు. ట్రంప్ హ‌యాంలో అమెరికా ఆర్థిక‌వ్య‌వ‌స్థ పూర్తిగా దిగ‌జారింద‌ని చెప్పారు. 

అయితే అమెరిక‌న్ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న‌దే త‌న అభిమ‌తం అని ట్రంప్ ప్ర‌క‌టించారు. దీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో ఉన్న‌వారికి చికిత్స కోసం ప్ర‌త్యేకంగా ప‌థ‌కం తీసుకొచ్చామ‌ని చెప్పారు. ఒబామా కేర్ పాల‌సీతో ఎవ‌రికీ ఉప‌యోగం లేద‌ని, అందుకే దాన్ని ర‌ద్దుచేశాన‌ని చెప్పారు. క‌రోనాను అరిక‌ట్టేందుకు ఎంతో ప్ర‌య‌త్నం చేశాన‌ని వెల్ల‌డించారు. క‌రోనా వ్యాప్తికి చైనా కార‌ణ‌మ‌ని ఆరోపించారు. మ‌రికొన్ని వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మూసేయాల‌ని బైడెన్ అనుకుంటున్నార‌ని, తాను మాత్రం అన్ని వ్య‌వ‌స్థ‌లు తెరిచే ఉంచాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ పురోగ‌తి సాధిస్తున్న‌ద‌ని తెలిపారు. 

క‌రోనా దృష్ట్యా ప్ర‌త్యేక నిబంధ‌న‌ల‌తో ఈ చ‌ర్చ జ‌రుగుతున్నది. దీంతో ఈసారి అధ్య‌క్ష అభ్య‌ర్థుల మ‌ధ్య క‌ర‌చాల‌నం లేకుండాని చ‌ర్చ ప్రారంభ‌మైంది. ప్ర‌జారోగ్య సంక్షోభంపై ప్ర‌జ‌లు మిమ్మ‌ల్నే ఎందుకు న‌మ్మాల‌ని, క‌రోనా సంక్షోభాన్ని ప్ర‌త్య‌ర్థికంటే మెరుగ్గా ఎలా ఎదుర్కోగ‌ల‌ర‌ని రెండో ప్ర‌శ్న అడిగారు.


logo