అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జో బైడెన్ కీలక నిర్ణయాలు

న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జో బైడెన్ వైట్‌హౌస్‌లో తనదైన ముద్రను చాటారు. అగ్ర రాజ్య అధ్యక్షుడిగా బుధవారం పాలనా పగ్గాలు స్వీకరించిన బైడెన్ తొలిరోజే ఏకంగా పదిహేడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసి తనదైన మార్క్‌ను ప్రదర్శించారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తిరగతోడేందుకు సమయం వృధా చేయబోనని కూడా బైడెన్ విస్పష్ట సంకేతాలు పంపారు. కరోనా వైరస్ విధ్వంసంతో నాలుగు లక్షల మంది అమెరికన్లు మరణించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఇక ఏమాత్రం జాప్యం లేకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బైడెన్ భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఎదుర్కోని సంక్లిష్ట సమస్యలు ఆయనను స్వాగతించడంతో కీలక అంశాలను పరిష్కరించడంలో ఎక్కువ సమయం తీసుకోరాదన్నది బైడెన్ ఆలోచనగా చెబుతున్నారు. వాతావరణ మార్పులు పెను ప్రమాదంగా పరిణమించడంతో పారిస్ పర్యావరణ ఒప్పందంలో తిరిగి పాలుపంచుకునే దిశగా ఆయన పలు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్లకు ఇచ్చిన హామీలను నిర్వర్తించడమే తన ముందన్న లక్ష్యమని బైడన్ ఇప్పటికే స్పష్టం చేశారు. వలసదారులను అమెరికా తిరిగి స్వాగతిస్తుందని, తమ దేశంలోకి వచ్చే వారిని మత ప్రాతిపదికన చూడబోమని అన్నారు.
ముస్లిం దేశాల వలసదారులు లక్ష్యంగా ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేసేలా వలసదారుల ప్రయోజనాలను కాపాడుతూ పలు ఉత్తర్వులను జారీ చేశారు. నిర్థిష్ట కాలవ్యవధిలో ఫెడరల్ వ్యవస్థల్లో వేళ్లూనుకున్న వర్ణ వివక్షను తొలగించేందుకు బైడెన్ విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తొలినుంచీ మైనారిటీలు, ఆఫ్రికన్-అమెరికన్లు పార్టీకి బాసటగా నిలుస్తున్నా వర్ణ వివక్షను పరిష్కరించడంలో విఫలమవుతున్నామని నల్ల జాతీయులు, ప్రగతిశీల డెమొక్రాట్ల ఎంతోకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.