శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 12, 2020 , 11:46:15

కరోనాపై ప్రాంక్‌ వీడియో.. యువకుడికి ఐదేళ్ల జైలు శిక్ష

కరోనాపై ప్రాంక్‌ వీడియో.. యువకుడికి ఐదేళ్ల జైలు శిక్ష

కరోనా వైరస్‌ అనగానే ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. చైనాలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఆయా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే మాస్కోలో ఓ యువకుడు కరోనా వైరస్‌పై ప్రాంక్‌ వీడియో చేసి జైలు పాలయ్యాడు. కరోమాత్‌ ఝరాబావ్‌ అనే యువకుడు మాస్కో అండర్‌గ్రౌండ్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. మాస్క్‌ ధరించిన ఆ యువకుడు ప్రయాణం మధ్యలోనే ఒక్కసారిగా కిందపడిపోయి.. కరోనా, కరోనా అంటూ గట్టిగా అరిచాడు. కాళ్లు, చేతులు కొట్టుకున్నాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మిగతా ప్రయాణికులు స్టేషన్‌ రాగానే రైలు దిగి పారిపోయారు.

అయితే ఇదంతా ప్రాంక్‌ వీడియో కోసం చేయాల్సి వచ్చిందని తర్వాత ప్రయాణికులకు కరోమాత్‌ చెప్పాడు. తాను చెప్పినట్లు తన స్నేహితుడు వీడియో చిత్రీకరించాడని అతడు పేర్కొన్నాడు. కరోమాత్‌ మాటలు విన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఈ వీడియోను కరోమాత్‌ తన బ్లాగర్‌లో పోస్టు చేయగా పోలీసులు స్పందించి.. అతడిని అరెస్టు చేశారు. ప్రజలను ఆందోళనకు గురి చేసినందుకు గానూ.. కరోమాత్‌తో పాటు వీడియో చిత్రీకరించిన అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోమాత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు పోలీసులు.


logo