ఆదివారం 12 జూలై 2020
International - Jun 12, 2020 , 10:53:20

క‌రోనా ఎఫెక్ట్‌: ‌పెరిగిపోతున్న పేద‌రికం

క‌రోనా ఎఫెక్ట్‌: ‌పెరిగిపోతున్న పేద‌రికం

లండన్‌: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్య పెరిగిపోతున్న‌ది. అభివృద్ధితో వంద‌ కోట్ల దిగువ‌కు వ‌చ్చిన పేద‌రికం.. ఇప్పుడు క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా మరోసారి 100 కోట్లపైకి ఎగబాకనుందని తాజాగా జ‌రిగిన ఒక అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. కింగ్స్‌ కాలేజ్ ఆఫ్‌ లండన్‌, ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఈ అధ్య‌య‌నం చేశాయి. ఈ అధ్య‌య‌నానికి సంబంధించిన నివేదిక‌ను శుక్రవారం విడుదల చేశాయి.

 లాక్‌డౌన్ వ‌ల్ల ప్రపంచ దేశాల్లోని పేదలు రోజుకు 500 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నారని తాజా అధ్య‌య‌నం అంచనా వేసింది.  ముఖ్యంగా పేదరిక స్థాయికి ఎగువ స‌మీప‌ జనాభా ఎక్కువగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంద‌ని తెలిపింది.  లాక్‌డౌన్‌ కారణంగా బంగ్లాదేశ్‌, భారత్, ఇండోనేషియా, పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ వంటి ఆసియా దేశాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రభావితం కానుందని నివేదిక తెలిపింది. 

రోజుకు 1.90 డాలర్లలోపు ఆదాయం ఉన్నవారిని నిరుపేదలుగా లెక్కగడుతామని, అటువంటి వారి సంఖ్య ఇప్ప‌టివ‌ర‌కు 700 మిలియన్లుగా ఉంద‌ని, క‌రోనా కార‌ణంగా ఇప్పుడు ఆ సంఖ్య 1.1 బిలయన్లకు చేరనుందని తాజా నివేదిక అంచనా వేసింది. సరైన చర్యలు తీసుకోకపోతే పేదరికాన్ని రూపుమాపడం కోసం ప్ర‌పంచ దేశాలు గత 30 ఏండ్ల‌లో సాధించిన ఫలితాలన్నీ తుడిచిపెట్టుకుపోనున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ ప్రొఫెసర్‌ ఆండీ సమ్నర్ తెలిపారు.


logo