శనివారం 30 మే 2020
International - Apr 05, 2020 , 20:09:15

కరోనా ఎఫెక్ట్: లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా పోప్ సందేశం

కరోనా ఎఫెక్ట్: లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా పోప్ సందేశం

హైదరాబాద్: కరోనా వైరస్ విశ్వమారిని అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. కరోనా కల్లోలం కారణంగా ఆయన తన పామ్ సండే మాస్‌ను జనసందోహం మధ్య కాకుండా లైవ్‌స్ట్రీంలో నిర్వహించారు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఆయన అనుయాయులు టీవీల్లో ఆ సందేశాన్ని వీక్షించారు.  క్యాథలిక్ హోలీవీక్ ఉత్సవాలను అట్టహాసంగా, జనసందోహం మధ్య నిర్వహించే శతాబ్దాల ఆచారానికి వ్యాటికన్ కరోనా కారణంగా గుడ్‌బై చెప్పింది. పోప్ తన సందేసంలో కరోనా ఉత్పాతాన్ని ఓ విషాదంగా అభివర్ణించారు. దీనిని అందరూ ధైర్యంగా, ఆశావాదంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

పామ్ సండే అనేది సిలువ వేసేందుకు ముందు జెరూసలేంలోకి క్రీస్తు ప్రవేశాన్ని సూచించే పండుగ. ఏప్రిల్ 12న జరిగే ఈస్టర్ సండే క్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఈ రెండు సందర్భాలలోను పోప్ జనసమ్మర్దం మధ్య ప్రసంగించడం సంప్రదాయంగా వస్తున్నది. కానీ కరోనా కారణంగా పోప్ లాగే 130 కోట్ల మంది క్యాథలిక్కులు నాలుగు గోడలకే పరిమితమయ్యారు. పోప్ రాజ్యమైన వ్యాటికన్ సిటీలోకి పర్యాటకుల రాకపోకలను నెలరోజులుగా నిలిపివేశారు.


logo