శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
International - Jul 08, 2020 , 11:46:33

ఆన్‌లైన్ మీటింగ్‌లో స్నానం చేస్తూ దొరికాడు.. ఉద్యోగం కాస్త ఊడింది!

 ఆన్‌లైన్ మీటింగ్‌లో స్నానం చేస్తూ దొరికాడు.. ఉద్యోగం కాస్త ఊడింది!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ వ‌ర్క్‌ఫ్రంహోమ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంట్లోనే క‌దా ఉండేద‌ని పైన కోటు వేసుకొని కింద షార్ట్ లేదా లుంగీ క‌ట్టుకొని మీటింగుల‌కు అటెండ్ అవుతుంటారు. ఇలా అయితే  ప‌ర్వాలేదు. కొంత‌మంది అయితే మీటింగ్‌లో ఉండ‌గానే ఇంటి ప‌నులు చేస్తూ అధికారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు. ఇత‌నైతే ఏకంగా బాత్రూంలో స్నానం కూడా చేసేశాడు. ఒక చిన్న పొర‌పాటు వ‌ల‌న అత‌ని నగ్నవతారాన్ని ప్రజలు కూడా చూడాల్సి వచ్చింది. అస‌లు ఏం జ‌రిగిందో తెలిస్తే న‌వ్వు ఆపుకోలేరు.

స్పెయిన్‌లోని కాంటాబ్రియాలో టోర్రెలావెగా కమ్యునికీ పార్ట్ టైమ్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న బెర్నాడో బుస్టిల్లా ఇటీవల ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ లైవ్ మీటింగ్ టీవీలో కూడా ప్రసారమ‌వుతున్న‌ది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్న‌ది. అత‌ను బ‌య‌టికి వెళ్లి కూతుర్ని తీసుకురావాలి. టైం అవుతుంద‌ని స్నానం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ, మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారో వినాల‌ని లాప్‌టాప్‌ను కూడా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. వీడియో క‌నిపించ‌కుండా హైడ్ చేయ‌బోయి, మినిమైజ్ చేశాడు. ఇక అంతే.. అత‌ను స్నానం ఎలా చేస్తున్నాడో అంతా లైవ్‌లో క‌నిపించింది.

అత‌ని అవ‌తారం చూసి తోటి కౌన్సిల‌ర్లు, అధికారులు షాక్ అయ్యారు. మీటింగ్‌లో ఎంత అరిచినా ష‌వ‌ర్ వ‌ల్ల బెర్నాడోకి వినిపించ‌లేదు. మీటింగ్‌ను మ‌ధ్య‌లో ఆపేందుకు కుద‌ర‌దు. డిస్ట్ర‌బెన్స్ క‌లిగుతుంద‌ని అధికారులు తిట్ట‌డంతో అత‌ని ఫ్రెండ్స్ బెర్నాడోకి ఫోన్ చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఇక చేసేదేంలేక మీటింగును వాయిదా వేసుకున్నారు. బెర్నాడో ప్ర‌శాంతంగా స్నానం చేసిన త‌ర్వ‌త విష‌యం తెలిసి బాధ‌ప‌డ్డాడు. మీటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు స్నానం చేయాల్సి వ‌చ్చిందో స‌మాధానం చెప్పి, టెక్నిక‌ల్ స‌మ‌స్య వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని క్ష‌మాప‌ణ‌‌లు తెలుపుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ దీనికి బాధ్యత వహిస్తూ అతడిని రాజీనామా చేయాలని కంపెనీ కోరింది. చూశారు క‌దా.. ఎప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో తెలియ‌దు. కాబ‌ట్టి ఉద్యోగం విష‌యం కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo