శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 17:26:12

పాకిస్తాన్‌లో 150 మంది డాక్టర్లు అరెస్ట్‌

పాకిస్తాన్‌లో 150 మంది డాక్టర్లు అరెస్ట్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో కరోనా విధులు నిర్వర్తిస్తున్న 150 మంది డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఈక్విప్‌మెంట్‌) కిట్ల కొరతకు వ్యతిరేకంగా కరోనా విధులకు హాజరవుతున్న డాక్టర్లు బలూచిస్తాన్‌ సీఎం ఇంటి ఎదుట ఇవాళ ఉదయం నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగిన డాక్టర్లను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేస్తున్న డాక్టర్లు, ఇతర మెడికల్‌ సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లు లేవని, దీంతో భయంతో విధులు నిర్వహించాల్సి వస్తోందని వైద్యులు పేర్కొన్నారు. తక్షణమే పీపీఈ కిట్లను సమకూర్చాలని వైద్యులు డిమాండ్‌ చేశారు. సీఎం ఇంటి వద్ద నిరసన చేస్తున్న సమయంలో పోలీసులకు, డాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డాక్టర్లపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. డాక్టర్లు 144 సెక్షన్‌ను ఉల్లంఘించినందుకే లాఠీఛార్జి చేసి, అదుపులోకి తీసుకున్నామని పాక్‌ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,469కి చేరింది. బలూచిస్తాన్‌లో 192 కేసులు నమోదు అయ్యాయి. పాక్‌లో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo