మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 17:23:28

పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇద్దరు ఏం చర్చించారంటే?

పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇద్దరు ఏం చర్చించారంటే?

న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా 75 వ వార్షికోత్సవం జరుపుకోవడం పట్ల అలాగే, రష్యాలో రాజ్యాంగ సవరణ చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయవంతంగా ఓటింగ్ ముగిసినందుకు అభినందనలు.2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నందుకు పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ కాల్ చేసినందుకు ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రంగాలలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగేలా ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు సమాచారం. అన్ని రంగాలలో భారత్‌తో ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి రష్యా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పుతిన్ పునరుద్ఘాటించారని వార్తసంస్థలు వెల్లడించాయి.

తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసి వద్ద చైనాతో ఉద్రిక్తత నెలకొన్న సమయంలోనే పుతిన్‌తో మోదీ ఫోన్లో మాట్లాడటం విశేషం సంతరించుకొన్నది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇటీవల రష్యాలో పర్యటించారు. ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ వంటి అనేక ముఖ్యమైన ఆయుధాల పంపిణీని వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా భారత్‌కు రష్యా హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చిన అనేక ఆయుధాలు రష్యా నుంచి బట్వాడా కావలసి ఉన్నది. 

2018 లో భారత్, రష్యా మధ్య అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ ఎస్-400 డీల్ రూ .40 వేల కోట్ల ఒప్పందం ఖరారైంది. ఇవేకాకుండా 31 ఫైటర్ జెట్లను కూడా రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తున్నట్టు సమాచారం. టీ-90 ట్యాంక్‌లోని ముఖ్యమైన భాగాల గురించి భారత్ కూడా రష్యాతో మాట్లాడింది. ఆయుధాల పంపిణీని వేగవంతం చేయడం గురించి చర్చించినట్లు ఇటీవల రష్యాలో పర్యటించిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

ఇలాఉండగా, 2036 సంవత్సరం వరకు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను రష్యన్ ప్రజలు ఆమోదించారు. 


logo