శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 22:05:30

ప్రపంచ ప్రశంసనీయ వ్యక్తుల జాబితాలో నలుగురు భారతీయులు

ప్రపంచ ప్రశంసనీయ వ్యక్తుల జాబితాలో నలుగురు భారతీయులు

ప్రపంచ ప్రశంసనీయ వ్యక్తుల జాబితాలో నలుగురు భారతీయులు చోటు సంపాదించుకున్నారు. 20 మందితో కూడి ప్రశంసనీయ వ్యక్తుల జాబితాలో భారత్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, విరాట్‌ కోహ్లీ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆరాధించబడిన, ప్రశసంనీయ వ్యక్తులతో కూడిన టాప్‌ 20 జాబితాను యుగోవ్‌ సంస్థ సర్వే చేసి సిద్ధం చేసింది. ఈ సర్వేలో 42 దేశాలకు చెందిన 4500 మందిని చేర్చారు. 

తొలిస్థానంలో 8.9 స్కోరుతో బరాక్‌ ఒబామా నిలువగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా బిల్‌ గేట్స్‌, జి జిన్‌పింగ్‌, నరేంద్ర మోదీ, జాకీ చాన్‌, క్రిస్టియానో రోనాల్డో, జాక్‌మా, దలైలామా, ఎలాన్‌ మస్క్‌, కేనూ రీవ్స్‌, లియోనల్ మెస్సీ, వ్లాదిమిర్‌ పుతిన్‌, మైఖేల్‌ జోర్డాన్‌, అమితాబ్ బచ్చన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, విరాట్‌ కోహ్లీ, షారుఖ్‌ఖాన్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, ఎర్డోగాన్‌, జోకో విడోడో ఉన్నారు. భారతదేశంలో 'మోస్ట్ అడ్మైర్డ్‌ మెన్‌' విషయానికి వస్తే.. రతన్ టాటా కంటే ముందు ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని 3 వ స్థానంలో నిలిచాడు. గ్లోబల్ చార్టుల్లో కోహ్లీ చోటు సంపాదించినప్పటికీ.. దేశంలో అత్యంత ఆరాధించబడిన క్రీడాకారుడుగా ధోని నిలిచారు. క్రీడాకారుల జాబితాలో ధోని తరువాత సచిన్ టెండూల్కర్ (నంబర్‌ 7), విరాట్ కోహ్లీ (నంబర్‌ 9), క్రిస్టియానో ​​రొనాల్డో (నంబర్‌10), లియోనెల్ మెస్సీ (నంబర్‌ 16), మైఖేల్ జోర్డాన్ (నంబర్‌ 21) ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు యూగోవ్ నామినేషన్లు తీసుకున్నారు. 'మీరు నిజంగా ఎవరిని ఆరాధిస్తారు' అని ప్రశ్నించి ఒకే ఒక సమాధానం తీసుకుని జాబితా తయారుచేశారు.