మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 15:34:57

టిక్‌టాక్‌ను నిషేధించాలని పాకిస్తాన్‌ కోర్టులో పిటిషన్‌

టిక్‌టాక్‌ను నిషేధించాలని పాకిస్తాన్‌ కోర్టులో పిటిషన్‌

లాహోర్‌: భారత్‌లో నిషేధానికి గురైన మొబైల్ ఫోన్ వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌కు దాయాది దేశం పాక్‌లోనూ చుక్కెదురు కానుంది. ఈ యాప్‌ను వెంటనే నిషేధించాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో ఓ పౌరుడు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్‌ అత్యంత ప్రాధాన్యతగలదని పేర్కొంటూ ఆ పౌరుడి తరఫున అడ్వొకేట్‌ నదీం సర్వర్‌ కోర్టు దృష్టికి తెచ్చినట్లు  డాన్ పత్రిక వెల్లడించింది. 

టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఇప్పటివరకూ విచారణ జరుగలేదని న్యాయవాది నదీం సర్వర్‌ కోర్టుకు తెలియజేశారు. ఈ యాప్‌ వల్ల ఇప్పటివరకూ 10 మందికి చనిపోయారని వివరించారు. అలాగే, ఇది అశ్లీల చిత్రాల  వ్యాప్తికి మూలంగా మారిందని ఆయన ఆరోపించారు.  టిక్‌టాక్‌లో పరిచయమైన స్నేహితుల బృందం ఓ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అశ్లీలత, అనుచితమైన కంటెంట్‌తోపాటు ప్రజలను అపహాస్యం చేసేందుకు ఉపయోగించినందుకుగానూ ఈ యాప్‌ను బంగ్లాదేశ్, మలేషియాలో ఇప్పటికే నిషేధించారని కోర్టుకు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo