శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 19:18:40

నిప్పుతో ఆటలొద్దన్న చైనా : వడ్డీతో చెల్లిస్తున్నామన్న బీజేపీ నేత

నిప్పుతో ఆటలొద్దన్న చైనా : వడ్డీతో చెల్లిస్తున్నామన్న బీజేపీ నేత

బీజింగ్ / న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నేత ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వెలుపల తైవాన్ అనుకూల పోస్టర్లు వేసిన చర్యను చైనా ఖండించింది. ఇది ముమ్మాటికీ నిప్పుతో ఆటలాడటమే అని చైనా ప్రభుత్వం పేర్కొనగా.. వెన్నుపోటు పొడిచి అగ్నితో ఆడటం మొదలెట్టిన మీకు వడ్డీతో తిరిగి చెల్లించడం ప్రారంభించామని అంతే ఘాటుగా బీజేపీ నేత బదులిచ్చారు. తైవాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునే వందలాది పోస్టర్లు చైనా రాయబార కార్యాలయం వెలుపల వేలాడదీయడంతో తైవాన్‌ విదేశాంగశాఖ హర్షం వ్యక్తం చేసింది. తమకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా నిలుస్తున్న దేశాలకు మరీ ముఖ్యంగా భారతదేశానికి హ్యాట్సాఫ్‌ అంటూ తైవాన్‌ ట్వీట్ చేసింది. 

లడఖ్‌లో ఇరు దేశాల సైన్యం ఘర్షణపడిన నేపథ్యంలో ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే సందర్భంలో తైవాన్‌ జాతీయ దినోత్సవం రావడం.. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట తైవాన్‌కు మద్దతుగా బీజేపీ నేత తాజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా పోస్టర్లు వేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉధృతం చేస్తుందని చైనా నిపుణులు గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయం ద్వారా హెచ్చరించారు. నిప్పుతో ఆటలాడుకుంటాన్నారని, ఇకనైనా మానుకోవాలని సూచించారు.కాగా, తమకు మద్దతుగా తమ దేశ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల తైవాన్‌ విదేశాంగశాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలతోపాటు ఇండియాకు శిరస్సు వంచి వందనం చేస్తున్నాం అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తిరిగి కొట్టిన బగ్గా

చైనా బెదిరింపులపై బీజేపీ నాయకుడు తాజిందర్‌ పాల్ సింగ్‌ బగ్గా మాట్లాడుతూ.. ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా చాలా రాబోతున్నాయని చెప్పారు. "చైనా అధ్యక్షుడు గత ఏడాది భారత్‌ వచ్చిన సమయంలో అతిథి దేవో భవ అన్న సాంప్రదాయంతో ఆయనను పలకరించాం. కానీ మీ దేశం లడఖ్‌లో మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది. అగ్నితో ఆడటం ప్రారంభించింది. మేము వడ్డీతో తిరిగి చెల్లించడం మొదలెట్టాం. మరింత అందుకోవడానికి ఎదురుచూస్తూ ఉండండి”అని అన్నారు. ఇలాఉండగా, తైవాన్‌ను “దేశం” అని సంబోధించవద్దని, వారు ‘వన్-చైనా’ విధానానికి అనుగుణంగా తైవాన్ అధ్యక్షుడిగా సాయ్ ఇంగ్-వెన్‌ను గుర్తించవద్దని భారతీయ మీడియాను న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ సూచించింది.logo