శుక్రవారం 10 జూలై 2020
International - Jun 03, 2020 , 11:59:23

టిబెట్ ప‌ర్వ‌తాల్లో చైనా సైనిక‌ విన్యాసాలు

టిబెట్ ప‌ర్వ‌తాల్లో చైనా సైనిక‌ విన్యాసాలు

హైద‌రాబాద్‌:  భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా మ‌రో సాహ‌సం చేసింది.  టిబెట్‌లో రాత్రి పూట చొర‌బాటు విన్యాసాలు చేప‌ట్టిన‌ట్లు చైనా అధికారిక మీడియా పేర్కొన్న‌ది.  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీలో భాగ‌మైన టిబెట్ మిలిట‌రీ క‌మండ్ ద‌ళాలు.. హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో సైనిక శిక్ష‌ణ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.  సుమారు 4700 మీట‌ర్ల ఎత్తులో ఈ విన్యాసాలు చోటుచేసుకున్నాయి.  చాలా దుర్భ‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పీఎల్ఏ సైనికులు త‌మ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. చైనా, భార‌త్ మ‌ధ్య అత్యంత ఎత్తైన స‌రిహ‌ద్దులు ఉన్నాయ‌ని, అలాంటి ప్రాంతాల్లో చొర‌బాట్లు జ‌రుగుతున్నాయ‌ని, దీనిలో భాగంగా త‌మ ద‌ళాల మోహ‌రింపు జ‌రుగుతున్న‌ట్లు చైనాకు చెందిన గ్లోబ‌ల్ టైమ్స్ పేర్కొన్న‌ది.  

వాస్త‌వాధీన రేఖ వ‌ద్దకు చైనా త‌మ ద‌ళాల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగ‌ళ‌వారం అంగీక‌రించారు. అయితే త‌మ మ‌ధ్య ఉన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు జూన్ ఆర‌వ తేదీన ఇరు దేశాలు చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న ల‌డాఖ్‌, సిక్కీం ప్రాంతాల్లో ప‌లుసార్లు రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. టిబెట్‌లోని తంగుగుల ప‌ర్వ‌తాల్లో రాత్రి ఒంటి గంట‌కు పీఎల్ఏ ద‌ళాలు సైనిక శిక్ష‌ణ‌లో పాల్గొన్న‌ట్లు చైనా క‌థ‌నం ద్వారా తెలుస్తోంది. డ్రోన్లు, పేలుడు ప‌దార్థాలు కూడా వాడిన‌ట్లు సంకేతాలు అందాయి. శిక్ష‌ణ స‌మ‌రంలోనూ భారీ స్థాయిలో మోటార్ షెల్స్‌, రైఫిల్ గ్రేనేడ్లు, రాకెట్లు వాడిన‌ట్లు చైనా మీడియా పేర్కొన్న‌ది. 



logo