బుధవారం 03 జూన్ 2020
International - May 22, 2020 , 18:58:16

పాకిస్థాన్‌ విమాన ప్రమాదం.. పైలట్‌ మృతదేహం లభ్యం

పాకిస్థాన్‌ విమాన ప్రమాదం.. పైలట్‌ మృతదేహం లభ్యం

ఇస్లామాబాద్‌ : కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్‌ కాలనీలోని ఇండ్లపై పీకే-303 విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఆర్మీ సిబ్బంది పలు మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో పైలట్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు సమాచారం. జనావాసాల్లో విమానం కుప్పకూలడంతో.. ప్రయాణికులే కాక.. స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు 3.2 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. 

విమానం అదుపుతప్పిన విషయాన్ని పైలట్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అధికారులకు చెప్పారు. రెండు ఇంజిన్లలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపారు. అంతలోనే విమానం మోడల్‌ కాలనీలోని ఇండ్లపై కుప్పకూలిపోయింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌లో 1966 నుంచి ఇప్పటి వరకు 17 విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ విమాన ప్రమాద దుర్ఘటనల్లో వందలాది మండి ప్రాణాలు కోల్పోయారు.


logo