ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేసింది!

- ఫైజర్ కరోనా టీకాకు బ్రిటన్ ఆమోదముద్ర
- వచ్చేవారం నుంచి అక్కడి ప్రజలకు వ్యాక్సినేషన్
- టీకాకు అనుమతిచ్చిన తొలి దేశంగా రికార్డు
- వచ్చేవారంలో రష్యాలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
లండన్, డిసెంబర్ 2: యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది! అమెరికా సంస్థ ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో వచ్చే వారం నుంచి అక్కడి ప్రజలకు ఈ టీకా అందుబాటులోకి రానుంది. పైజర్ వ్యాక్సిన్ సురక్షితమని బ్రిటన్ సంస్థ ‘మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ (ఎంహెచ్ఆర్ఏ) తెలిపింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా, టీకా సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం తెలిపినట్టు బ్రిటన్ వెల్లడించింది. ‘ఎంతో ఉత్సాహంగా ఉంది. మనం ఉషోదయాన్ని చూడబోతున్నాం. లాక్డౌన్ నిబంధనలను పాటించి మన కృషిని రెట్టింపు చేద్దాం. ఈ ఏడాది ఎంతో దుర్భరంగా గడిచింది. అయితే 2021 మాత్రం ప్రకాశవంతంగా ఉంటుంది’ అని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ అన్నారు. టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో ఆ దేశంలో కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి మరికొన్ని రోజుల్లోనే టీకాను అందించనున్నారు.
ఎంఆర్ఎన్ఏ ఆధారంగా..
ఫైజర్ వ్యాక్సిన్‌ను ‘ఎంఆర్ఎన్ఏ’ పద్ధతి ఆధారంగా అభివృద్ధి చేశారు. వైరస్ నుంచి చిన్న జెనెటిక్ కోడ్‌ను తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తారు. మనుషులలో ఎంఆర్ఎన్ఏ టీకా వినియోగానికి ఇంతవరకు ఆమోదం లేదు. కేవలం క్లినికల్ ట్రయల్స్‌లో మాత్రమే అనుమతించారు. ఎంహెచ్ఆర్ఏ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఫైజర్ టీకా మనుషులలో వినియోగానికి సురక్షితమేనని నిపుణులు చెప్తున్నారు. ఎంహెచ్ఆర్ఏ బ్రిటన్‌కు చెందిన స్వతంత్ర సంస్థ. భద్రతా ప్రమాణాలకు దీనికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.
ఫ్రిజ్‌లో 4-5 రోజులు నిల్వ
జర్మనీలోని బయోఎన్‌టెక్ కేంద్రాలు, బెల్జియంలోని ఫైజర్ తయారీ కేంద్రాల్లో ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. డ్రై ఐస్ మధ్య ప్రత్యేక బాక్సుల్లో సరఫరా చేయాలి. ఫ్రిజ్‌లో నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ ఉంచవచ్చని, ఈ నేపథ్యంలో సరఫరా, పంపిణీలో ఇబ్బందులేమీ ఉండబోవని ఫైజర్ కంపెనీ చెప్తున్నది.
వేగంగా అభివృద్ధి..
కరోనా టీకాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చేసి, ఆమోదం పొందినది ఫైజర్ టీకానేని బీబీసీ వార్తాసంస్థ తెలిపింది. కేవలం 10 నెలల్లోనే ఈ టీకాను అభివృద్ధి చేశారు. సాధారణంగా వ్యాక్సిన్ అభివృద్ధికి దశాబ్దాల సమయం పడుతుంది. నవంబర్ 18న ఫైజర్ టీకా తుది ఫలితాలు వెలువడ్డాయి. కరోనాను తమ టీకా 95 శాతం సమర్థంగా అడ్డుకుంటున్నదని ఆ సంస్థ ప్రకటించింది. పెద్దగా అనారోగ్య సమస్యలేవీ తలెత్తలేదని తెలిపింది.
భారత్‌కు వచ్చేనా?
ఫైజర్ టీకా ఇప్పట్లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో టీకాను విడుదల చేయాలంటే తప్పనిసరిగా ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
వచ్చేవారం రష్యాలోనూ వ్యాక్సినేషన్: పుతిన్
ఫైజర్ టీకాకు ఆమోదం తెలుపడంతోపాటు వచ్చేవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించిన కొన్ని గంటలకే రష్యా కీలక ప్రకటన చేసింది. తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాను వచ్చే వారాంతం నుంచి ప్రజలకు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులను ఆదేశించారు. తొలుత టీచర్లకు, వైద్యులకు టీకా అందించాలని సూచించారు.
తాజావార్తలు
- డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భారత్ టాప్
- దీప్‌సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- యాడ్ జింగిల్స్ సాంగ్.. వావ్! ఎంత బాగుందో..
- 'నా వ్యాఖ్యలు నొప్పిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం'
- విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి