శనివారం 06 జూన్ 2020
International - Apr 12, 2020 , 01:51:09

లాక్‌డౌన్‌ ప్రజలదే.. స్వీడన్‌ విధమిదే

లాక్‌డౌన్‌ ప్రజలదే.. స్వీడన్‌ విధమిదే

  • కరోనా విజృంభిస్తున్నా ఊసేలేని లాక్‌డౌన్‌ 
  • ప్రజలే బాధ్యతగా ప్రవర్తించాలంటున్న ప్రభుత్వం
  • ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్న స్వీడన్‌వాసులు
  • 10వేలు దాటిన కేసులు.. 887 మరణాలు 

కరోనా ధాటికి దాదాపు ప్రపంచమంతా దిగ్బంధంలోకి వెళ్తే.. అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్కూళ్లు మొదలు వర్సిటీల వరకు విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ నడుస్తున్నది. హోటళ్లు, కాఫీ షాప్‌లు జనాలతో కళకళలాడుతున్నాయి. దుకాణాలన్నీ తెరిచే ఉంటున్నాయి. ‘మాస్కులు ధరించండి.. బయటికొస్తే ఫైన్‌ వేస్తాం, జైల్లో పెడుతాం’ వంటి నిబంధనలేమీ లేవు. ఆ దేశమే స్వీడన్‌. పొరుగునున్న ఫ్రాన్స్‌, జర్మనీ కరోనాతో అతలాకుతలం అవుతున్నా, పక్కనే ఉన్న ఇంగ్లాండ్‌లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చావు అంచులదాకా వెళ్లివచ్చినా.. స్వీడన్‌లో మాత్రం ప్రజలపై పెద్దగా ఆంక్షలు విధించలేదు. అలాగని కరోనా కేసుల సంఖ్య తక్కువేం లేదు. 10వేల కేసులు, 900 మరణాలు నమోదయ్యాయి. 

బాధ్యతగా మెలుగుతున్నారు

‘మేము ఆంక్షలు విధించేకన్నా.. ప్రజలే బాధ్యతగా వ్యవహరించాలి’ అనేది స్వీడన్‌ ప్రభుత్వ సూత్రం. కరోనా ప్రభావిత దేశాల్లో మాదిరిగానే నిర్ణీత దూరం, స్వీయ నిర్బంధం, క్వారంటైన్‌, మాస్కులు ధరించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వంటి సూచనలు చేసింది. అంతేతప్ప కచ్చితంగా పాటించాలంటూ ఆంక్షలు పెట్టలేదు. ‘స్వీడన్‌వాసులపై మాకు అపారమైన నమ్మకం ఉన్నది. వారు తమ బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు’ అని స్వీడన్‌ జాతీయ ఆరోగ్య సలహాదారు టెగ్నెల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ విధించిన దేశాలతో పోల్చితే తమ దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల శాతం తక్కువగానే ఉన్నదన్నారు. జనవరి 31న స్వీడన్‌లో మొదటికేసు నమోదైంది. ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తుండటంతో కేసుల సంఖ్య నెమ్మదించింది. సగటు పెరుగుదల 8-10 శాతం మధ్యే ఉండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యధిక శాతం ప్రజలు సమర్థిస్తుండగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినొద్దనే లక్ష్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు. 


logo