బుధవారం 03 జూన్ 2020
International - May 03, 2020 , 01:15:44

నివురుగప్పిన వుహాన్‌!

నివురుగప్పిన వుహాన్‌!

  • లాక్‌డౌన్‌ ఎత్తి వేసినా కర్ఫ్యూ వాతావరణమే
  • బయటకు రావడానికి భయపడుతున్న ప్రజలు
  • దుకాణాలు వెలవెల.. అద్దె భారాలతో మూసివేత
  • వైరస్‌ మళ్లీ విజృంభిస్తే.. మరోదఫా లాక్‌డౌన్‌!

వుహాన్‌: కొవిడ్‌-19 వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ అనంతరం కూడా నిశబ్దమే రాజ్యమేలుతున్నది. నగరంలో ప్రజలు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారని అక్కడి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా సృష్టించిన విలయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇండ్ల నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. కస్టమర్లు రాకపోవడంతో వ్యాపారస్థులు దుకాణాల్ని మూసివేస్తున్నారు. వైరస్‌ మరోసారి విరుచుకుపడొచ్చనే ఆందోళన ఆ నగరాన్ని పట్టిపీడిస్తున్నది. 

కొద్దిమంది మాత్రమే బయటకు

కొవిడ్‌-19 కేసులు క్రమంగా తగ్గాయని తెలుసుకున్న అధికారులు 76 రోజుల అనంతరం ఏప్రిల్‌ 8న వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో మరుసటి రోజు నుంచి ప్రజలు  వీధుల్లోకి వస్తారని, నగరంలో దుకాణాలు తెరుచుకుంటాయని, వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయని భావించారు. అయితే, వాళ్లు అనుకున్నట్టు ఏమీ జరుగలేదు. నగరంలో ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ చాలావరకు దుకాణాలు తెరుచుకోలేదు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. మాస్కులు ధరించి చాలా కొద్ది మంది మాత్రమే వీధుల్లోకి వస్తున్నారు. నిర్ణీత దూరం వంటి పద్ధతుల్ని  పాటిస్తున్నారు. కస్టమర్లు రాకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. నగరంలో తెరుచుకున్న కొద్దిపాటి రెస్టారెంట్లు కూడా పార్సిల్‌ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో నేను నా రెస్టారెంటును రెండు రోజులు తెరిచాను. కస్టమర్లు ఎవరూ తినడానికి రాలేదు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రెండు, మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు రోజుల్లో నేను సంపాదించిన దాని కంటే రెస్టారెంటును తెరువడానికి, ఆహారాన్ని సిద్ధం చేయడానికి పెట్టిన ఖర్చు ఎంతో ఎక్కువ. దీంతో రెస్టారెంటును మూసేశా’ అని ఓ స్థానిక రెస్టారెంటు యజమాని తెలిపారు. మరోవైపు, స్టార్‌బక్స్‌, మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌, కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌ వంటి ప్రధాన ఆహార గొలుసు సంస్థలు కూడా తమ వ్యాపార విధానాన్ని, సర్వీసుల తీరుతెన్నుల్ని మార్చుకుంటున్నాయి. కస్టమర్లను స్టోర్ల లోనికి అనుమతించడం లేదు. స్టోర్‌ బయట కుర్చీలు వేసి, సిబ్బంది ద్వారా కావల్సిన ఆర్డర్లను అందజేస్తున్నాయి.

నిజాలు వేరుగా ఉన్నాయి.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కొన్ని రంగాలకు చెందిన వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని, ఏప్రిల్‌ చివరినాటికి 100 శాతం ఉత్పత్తిని ప్రారంభిస్తామని స్థానిక ప్రభుత్వం చెప్పినప్పటికీ వుహాన్‌లో వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. మూడు నెలలపాటు చిన్న వ్యాపారులకు అద్దెను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దుకాణం యజమానులు, బిల్డింగుల ఓనర్లు ఊరుకోవడంలేదు. కొనుగోలుదారులు రాకపోవడం, వ్యాపారాలు సాగకపోవడం, అద్దె కోసం యజమానుల ఒత్తిళ్లు వెరసి నగరంలో చాలా వరకు వ్యాపారస్థులు తమ దుకాణాల్ని తెరువడం లేదు. ప్రభుత్వ సాయం అందడానికి చాలా సమయం పడుతుందని భావించిన మరికొందరు తమ దుకాణాలు, రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. వైరస్‌ భయంతో ప్రజలు కొనుగోళ్లకు భయపడుతున్నారని, వుహాన్‌ అభివృద్ధిపై వైరస్‌ ప్రభావం మూడేండ్ల వరకూ ఉండొచ్చని మెక్వైరీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఆర్థికవేత్త ల్యారీ హూ తెలిపారు. నగరంలో మొదట ఉత్పాదక రంగం పుంజుకుంటుందని, ఆతర్వాత కొనుగోళ్లలో వృద్ధి కనిపించవచ్చని అంచనా వేశారు. లాక్‌డౌన్‌ ప్రభావం చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలపై వేర్వేరుగా ఉన్నదని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ (ఆసియా-పసిఫిక్‌) అధిపతి షౌన్‌ రోషే పేర్కొన్నారు. 

మరోసారి విరుచుకుపడొచ్చు!

వుహాన్‌ నగరం మాన్యుఫాక్చరింగ్‌, రవాణా హబ్‌గా ఉన్నది. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో నగరంపై మరోసారి వైరస్‌ విరుచుకుపడొచ్చని చాలా మంది స్థానికులు, వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్‌ను విధిస్తుందని, అదే జరిగితే ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడినట్టేనని అంటున్నారు. 


logo