సోమవారం 30 మార్చి 2020
International - Feb 05, 2020 , 09:51:16

షేక్‌హ్యాండ్ ఇవ్వ‌ని ట్రంప్‌.. ప్ర‌సంగ ప‌త్రాల్ని చింపేసిన స్పీక‌ర్‌

షేక్‌హ్యాండ్ ఇవ్వ‌ని ట్రంప్‌.. ప్ర‌సంగ ప‌త్రాల్ని చింపేసిన స్పీక‌ర్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  అయితే ఆ  ప్ర‌సంగానికి ముందు ఆయ‌న స్పీక‌ర్ నాన్సీ పెలోసీతో చేతులు క‌లిపేందుకు నిరాక‌రించారు.  వాషింగ్ట‌న్‌లోని క్యాపిట‌ల్ హిల్‌లో సేనేట్‌, హైజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ స‌భ్యుల ముందు ట్రంప్ మూడ‌వ సారి ప్ర‌సంగించారు.  ప్ర‌సంగానికి ముందు ట్రంప్ త‌న ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌సంగ ప్ర‌తుల‌ను స్పీక‌ర్ నాన్సీకి ఇచ్చారు.  ట్రంప్ నిలుచుని ప్ర‌సంగం చేసే వేదిక వెనుకే ఉన్న టేబుల్‌పై కూర్చున్న స్పీక‌ర్ నాన్సీకి.. ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు.  ప్ర‌సంగ పాఠాన్ని అందుకున్న నాన్సీ.. ఆ త‌ర్వాత ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ట్రంప్ మాత్రం ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా మైక్ వైపు తిరిగారు. 

ఇక ప్ర‌సంగం మొద‌లైన త‌ర్వాత‌.. డెమోక్రాట్ నేత‌ నాన్సీ త‌న ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేస్తూ ఉండిపోయారు. ట్రంప్‌పై అభిశంస‌న‌కు సేనేట్‌లో చ‌ర్య‌లు చేప‌ట్టింది నాన్సీనే కాబ‌ట్టి.. ట్రంప్ ఆమెతో చేతులు క‌లిపేందుకు నిరాక‌రించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.  ఉక్రెయిన్ అధ్య‌క్షుడిని  ఫోన్‌లో ట్రంప్ బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న సేనేట్‌.. ట్రంప్‌పై అభిశంస‌న‌కు  అంగీక‌రించింది.  అభిశంస‌న‌కు మూల కార‌ణ‌మైన నాన్సీతో గ‌త అక్టోబ‌ర్ నుంచి ట్రంప్ మాట్లాడ‌డంలేదు. స‌భ‌ల స‌మ‌యంలో ఎదురుప‌డ్డా వారి మ‌ధ్య ఎటువంటి ప‌ల‌క‌రింపులు లేవు.

అయితే ఇవాళ ప్ర‌సంగ ప్రారంభ స‌మ‌యంలో ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఆగ్ర‌హం మీదున్న నాన్సీ.. చివ‌ర్లో ఆ ప్ర‌సంగ కాపీని  చింపేశారు.  ట్రంప్ త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌గానే.. ఆమె త‌న చేతిలో ఉన్న ఆ పేప‌ర్ల‌ను రెండు ముక్క‌లు చేసి త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.  ప్ర‌సంగ ప‌త్రాన్ని ఎందుకు చింపేశార‌ని రిపోర్టర్లు ఆమెను ప్ర‌శ్నించ‌గా.. ఇదే స‌రైన చ‌ర్య అని ఆమె అన్నారు.  అదో చెత్త స్పీచ్ అని నాన్సీ అన్నారు.  సుమారు 70 నిమిషాల పాటు ట్రంప్ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.


logo