సోమవారం 01 జూన్ 2020
International - May 21, 2020 , 11:35:20

ట్రంప్‌ను పెలోసి ఏకి పారేశారు

ట్రంప్‌ను పెలోసి ఏకి పారేశారు

వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి మరోసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఆయన ఊబకాయం గురించి గేలిచేసిన పెలోసి తాజాగా ఆయనను బూట్లపై కుక్క పెంట పూసుకువచ్చిన పిల్లవానిగా అభివర్ణించారు. అధ్యక్షుని తర్వాత హోదాలో ఉపాధ్యక్షుని తర్వాతి స్థానంలో ఉన్న పెలోసి డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఆమెకూ, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌కూ ఏమాత్రం పొసగదు. గత ఏడు నెలలుగా ఇద్దరూ కనీసం ఒక్కసారిగా మాట్లాడుకోలేదు. ఇప్పుడేమో ఏకంగా మాటల యుద్ధం మొదలైంది. వైద్యశాస్త్రపరంగా రుజువుకాని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన తర్వాత పెలోసి ఆయన ఊబకాయాన్ని ఎత్తిచూపారు. తానైతే అధ్యక్షునికి అలాంటి మందులు సూచించనని అన్నారు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో తిట్లూ, వ్యక్తిగత విమర్శలతో స్పందించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ను పట్టుకుని సైకో అనేశారు. దీనిపై సమాధానమిస్తూ, కుక్క పెంట షూలకు పూసుకుని తిరిగే పిల్లవానిగా ఆమె ట్రంప్‌ను పోల్చారు. పైగా అది అంత సులభంగా వదలదని, అందరికీ పూస్తాడని కూడా అన్నారు. ఇదంతా అధ్యక్షునికి ఆయన భాషలోనే సమాధానం చెప్పడమని ఆమె పేర్కొన్నారు. ఆవేశం వస్తే వెనకాముందూ చూసుకోకుండా కామెంట్లు చేసే ట్రంప్ దీనిపై ఏమంటారో చూడాలి.


logo