శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 11:49:57

చైనాను ధైర్యంగా ఎదుర్కొవాల్సిందే: అమెరికా వ్యాఖ్య‌

చైనాను ధైర్యంగా ఎదుర్కొవాల్సిందే: అమెరికా వ్యాఖ్య‌

వాషింగ్ట‌న్‌: త‌ర‌చూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను నిలువరించాలంటే ఆ దేశం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను నేరుగా ఎదుర్కోవ‌డ‌మే మార్గ‌మ‌ని అమెరికా అభిప్రాయ‌ప‌డింది. అయితే భారత్, చైనా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్న‌ది. ఈ మేరకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఒక‌ ప్రకటన విడుదల చేసింది.

'భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని మేం నిశితంగా ప‌రిశీలిస్తున్నాం. చైనా త‌ర‌చుగా ఇంటా బయటా కయ్యానికి కాలు దువ్వుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్న‌ది. తైవాన్ మొదలు జింగ్‌జియాంగ్, దక్షిణచైనా సముద్రం, హిమాలయాలు, సైబర్ ప్రపంచం ఇలా అనేక వేదికలపై చైనా దురుసుగా వ్యవహరిస్తున్న‌ది. ఒక‌వైపు సొంత ప్రజలను అణిచివేస్తూ మ‌రోవైపు పొరుగు దేశాలపై బెదిరింపులకు దిగుతున్న‌ది. చైనా దుందుడుకు వ్య‌వ‌హారాల‌ను అడ్డుకోవాలంటే ఆ దేశం చేస్తున్న అన్ని ప్ర‌య‌త్నాల‌కు ధైర్యంగా ఎదురు నిలువ‌డ‌మ ఏకైక మార్గం' అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

మరోవైపు అమెరికా ర‌క్ష‌ణ విభాగం పెంటగాన్ సైతం చైనా దుర్నీతి ప్రదర్శిస్తున్న‌దంటూ మండిపడింది. 'బెదిరింపుల ద్వారా ఒత్తిడి పెంచుతూ చైనా తనకు కావాల్సింది సాధించుకునే ప్రయత్నం చేస్తున్న‌ది. దక్షిణ, తూర్పు చైనా సముద్రం, భారత్, భూటాన్ సరిహద్దు వద్ద ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్న‌ది. పూర్తిస్థాయి యుద్ధానికి దిగకుండా ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి తెస్తున్న‌ది' అని వ్యాఖ్యానించింది. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పెంటగాన్ ఈ విషయాన్ని పేర్కొన్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo