శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 07, 2020 , 01:33:42

కృష్ణబిలాలకు దారులు

కృష్ణబిలాలకు దారులు

  • భౌతికశాస్త్రంలో నోబెల్‌ ప్రకటన 
  • బ్రిటన్‌, జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలకు  సంయుక్తంగా పురస్కారం 
  • బ్లాక్‌హోల్స్‌ గుట్టు విప్పినందుకు ప్రైజ్‌

స్టాక్‌హోం, అక్టోబర్‌ 6: అనంతవిశ్వంలో కంటికి కనిపించకుండా నక్షత్రాలను, గ్రహాలను నియంత్రిస్తున్న మహాకృష్ణబిలాల గుట్టు విప్పి ఎన్నో ఖగోళ చిక్కుప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాదికి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. బ్రిటన్‌కు చెందిన రోజర్‌ పెన్‌రోస్‌, జర్మనీ పరిశోధకుడు రిన్‌హార్డ్‌ గెంజెల్‌, అమెరికన్‌ శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్‌లకు రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ మంగళవారం ఈ బహుమతిని ప్రకటించింది. బహుమతి మొత్తంలో పెన్‌రోస్‌కు సగం, మిగతా ఇద్దరికి సగం పంచనున్నట్టు అకాడెమీ కార్యదర్శి గొరన్‌ కే హన్సన్‌ తెలిపారు. భౌతికశాస్త్రంలో ఈ అత్యున్నత బహుమతి పొందిన మహిళల్లో ఆండ్రియా గెజ్‌ నాలుగోవారు. విజేతలకు బంగారు పతకాలు, ముగ్గురికీ కలిపి 1.1 మిలియన్‌ డాలర్ల (రూ.8 కోట్లు) నగదు బహుమతి అందిస్తారు. 

ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతంతో..

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతంపై పరిశోధనలు చేసిన రోజర్‌ పెన్‌రోస్‌, విశ్వంలో కృష్ణ బిలాలు ఏర్పడే విధానాన్ని గుర్తించారు. నిజానికి కృష్ణబిలాలు ఉన్నాయని ఐన్‌స్టీన్‌ నమ్మలేదు. విశ్వ నియమాలన్నీ ఒకేలా ఉంటాయని ప్రతిపాదించారు. కాంతి తనమార్గంలో సర్వ స్వతంత్రంగా ప్రయాణిస్తుందని నమ్మారు. కానీ, ఐన్‌స్టీన్‌ ఆలోచన తప్పు అని పెన్‌రోస్‌ నిరూపించారు. అదే సమయంలో ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని సరైనదని నిరూపించారు. ఆ సిద్ధాంతాన్నే ఆధారంగా తీసుకొని, దానికి నూతన గణిత సూత్రాలను జోడించి సరికొత్త సూత్రీకరణ చేశారు. కాంతినికూడా మింగేయగల పదార్థం విశ్వంలో ఉన్నదని 1965లో ప్రచురించిన పరిశోధన పత్రంలో పెన్‌రోస్‌ ప్రతిపాదించారు.

పాలపుంత రహస్యాలు విప్పి.. 

గెంజెల్‌, గెజ్‌లు తమ బృందాలతో విడివిడిగా పాలపుంత కేంద్ర భాగంపై పరిశోధన చేశారు. 1990 దశకం నుంచి వీరు పాలపుంతలోని సగిట్టారియస్‌ ఏ అనే ప్రాంతంపై శక్తిమంతమైన ఈవెంట్‌ హారిజన్‌ టెలిస్కోపులతో అధ్యయనం చేశారు. అక్కడ ఉన్న నక్షత్రాలన్నింటినీ ఏదో మహా అదృశ్య శక్తి తనచుట్టూ తిరిగేలా చేస్తున్నదని గుర్తించారు. ఆ ప్రాంతం నాలుగు సూర్యకుటుంబాలంత విస్తీర్ణంలో, మన సూర్యుడికన్నా 40 లక్షల రెట్లు ద్రవ్యరాశితో ఉన్నదని తేల్చారు. చివరకు అది ఓ మహా కృష్ణబిలమని కనిపెట్టారు. 

రాయల్‌ కోర్టులో వేడుక బంద్‌ 

భౌతికశాస్త్రంలో నోబెల్‌ గెలుచుకున్నవారికి స్వీడన్‌ రాజు కింగ్‌ 16 ఏటా రాయల్‌ కోర్టులో డిసెంబర్‌ 10న అవార్డులను అందించటం ఆనవాయితీ. కానీ కరోనా కారణంగా విజేతలకు వారివారి దేశాల్లోనే అవార్డులు ప్రదానం చేస్తామని రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ప్రకటించింది.

ఏమిటీ కృష్ణబిలం? 

విశ్వంలో భారీ నక్షత్రాలు పూర్తిగా మండిపోయిన తర్వాత జనించే అసాధారణ గురుత్వాకర్షణ శక్తివల్ల తమలోతామే కూలిపోతాయి. అందులో మిగిలిన పదార్థం తీవ్ర ఒత్తిడికి గురయ్యి కుంచించుకుపోతుంది. దానికి సమీపంలో ఉన్న ఖగోళ పదార్థాన్నంతా అది తనలోకి లాగేసుకుంటుంది. చివరకు అందులోకి వెళ్లిన కాంతి కూడా బయటకు రాలేదు. వీటినే కృష్ణబిలం అంటారు. వెలుతురు కూడా వీటి నుంచి బయటకు రాకపోవటం వల్ల ఇవి కంటికి కనిపించవు. సమీపంలోని పదార్థపు అసాధారణ కదలికల ఆధారంగా కృష్ణ బిలాల ఉనికిని గుర్తిస్తారు.