ఆదివారం 24 జనవరి 2021
International - Dec 20, 2020 , 19:40:52

లండన్‌లో పతంజలి 'కరోనిల్‌'.. అనుమతిలేదంటున్న ఎంహెచ్‌ఆర్‌ఏ

లండన్‌లో పతంజలి 'కరోనిల్‌'.. అనుమతిలేదంటున్న ఎంహెచ్‌ఆర్‌ఏ

న్యూఢిల్లీ : పతంజలి సంస్థ తయారుచేసిన 'కరోనిల్‌' లండన్‌లో ప్రత్యక్షమయ్యాయి. పతంజలికి చెందిన స్వాసరి-కరోనిల్‌ కిట్లను లండన్‌లోని వివిధప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లో విక్రయిస్తున్నట్లు బీబీసీ తెలిపింది. ఈ మూలికా వైద్యాన్ని పలు దుకాణాలు తమ వెబ్‌సైట్లలో కొవిడ్‌-19 ఇమ్యునిటీ బూస్టర్‌గా కూడా ప్రచారం చేస్తున్నాయి. 

కరోనా వైరస్ నివారణకని తొలుత ప్రచారం చేసి అనంతరం "రోగనిరోధక శక్తి బూస్టర్" గా మార్చిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ తయారుచేసిన 'స్వాసరి-కరోనిల్ కిట్లు' లండన్లోని అల్మారాల్లోకి వచ్చాయి. యోగా గురువు రామ్‌దేవ్ జూన్ 23 న మార్కెట్లోకి విడుదల చేశారు. పతంజలి ఆయుర్వేద్ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. జూన్-అక్టోబర్ మధ్య కాలంలో రూ.250 కోట్ల విలువైన 2.5 మిలియన్ స్వాసరీ-కరోనిల్ కిట్లను కంపెనీ విక్రయించింది. స్వాసరీ-కరోనిల్ కిట్లను "రోగనిరోధక శక్తిని పెంచేవి" అని ప్రకటించడానికి భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి ఆయుర్వేద్‌కు అనుమతి ఇవ్వగా.. బ్రిటన్‌లో ప్రకటనల నియమాలు ఇటువంటి పద్ధతులను అనుమతించవు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో స్వాసరీ-కరోనిల్ తయారీకి ఉపయోగించే మొక్కల ఆధారిత పదార్థాలు కరోనా వైరస్ నుంచి ఎటువంటి రక్షణను ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు బీబీసీ పేర్కొన్నది.

ఇలాఉండగా, పతంజలి ఆయుర్వేద్ యొక్క స్వాసరి-కరోనిల్ కిట్ల అమ్మకాలను ఎప్పుడూ ఆమోదించలేదని బ్రిటీష్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) తెలిపింది. "ఏదైనా అనధికార ఔషధ ఉత్పత్తిని యూకే మార్కెట్లో విక్రయించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo