బుధవారం 02 డిసెంబర్ 2020
International - Oct 31, 2020 , 17:54:29

ఫ్రాన్స్‌లో రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మొదలు

ఫ్రాన్స్‌లో రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మొదలు

పారిస్‌: ఫ్రాన్స్‌లో రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ శుక్రవారం నుంచి మొదలైంది. డిసెంబర్‌ 1 వరకు ఇది అమలులో ఉండనున్నది. దీంతో శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన వీధులు జన సంచారం లేక బోసిపోయాయి. కాగా లాక్‌డౌన్‌కు ముందుకు ఆ దేశ ప్రజలు గురువారం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. దీంతో నిత్యవసర వస్తువుల షాపులు, మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు దేశ రాజధాని పారిస్‌ నుంచి పెద్ద సంఖ్యలో ఇతర నగరాలకు తరలివెళ్లారు. దీంతో సుమారు 700 కిలోమీటర్ల మేర రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ కాలంలో నగరంలోని ఇండ్లలో ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు కొందరు తెలిపారు. 

కరోనా మహమ్మారి ఐరోపాలో మరోసారి విజృంభిస్తున్నది. కరోనా కేసుల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌లో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 13.3 లక్షలు దాటగా 36 వేల మందికిపైగా మరణించారు. మరోవైపు నిత్యం సగటున కొత్తగా 50 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనాభాతో పోల్చితే అమెరికా కన్నా రెండు రెట్ల మేర వైరస్‌ వ్యాప్తిస్తున్నది.  దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించారు. శుక్రవారం నుంచి డిసెంబర్‌ 1 వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించారు.

కాగా రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కిలోమీటరు పరిధిలో గంట పాటు వ్యాయామం, ఆసుపత్రులకు వెళ్లేందుకు, పని కోసం, నిత్యవసరాల కొనుగోళ్లకు మాత్రమే అనుమతిస్తారు. కేఫ్‌లు, రెస్టారెంట్లతోపాటు మిగతా అన్నింటిని మూసివేశారు. స్నేహితుల ఇండ్లకు వెళ్లడం, అతిథిలను ఆహ్వానించడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. 

మరోవైపు ఐరోపాలోని పలు దేశాలు కూడా ఫ్రాన్స్‌ మాదిరిగా రెండోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించేందుకు యోచిస్తున్నాయి. జర్మనీ, బెల్జియంలో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.