కరోనా వల్ల.. ఆ దేశంలో మళ్లీ పెరిగిన ఆత్మహత్యలు

టోక్యో: జపాన్లో మళ్లీ ఆత్మహత్యలు పెరిగాయి. దశాబ్ధ కాలం తర్వాత మహమ్మారి కరోనా వల్ల సూసైడ్ చేసుకునే వారి సంఖ్య మళ్లీ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది తమ దేశంలో 20,919 మంది ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. సూసైడ్ రేటు 3.7 శాతం పెరిగినట్లు ప్రాథకమింగా అంచనా వేశారు. జపాన్ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువే. మహిళలు, చిన్నపిల్లలు అక్కడ ఎక్కువ శాతం ఆత్మహత్య చేసుకునే కేసులు అధికం. ఆత్మహత్యలు ఎక్కువ స్థాయిలో ఉన్న ఏడు అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. ప్రాంతీయంగా దక్షిణ కొరియాలో ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది.
2020 ఆరంభంలో తొలి విడుత అమలు చేసిన లాక్డౌన్ సమయంలో ఆత్మహత్యలు పెద్దగా చోటుచేసుకోలేదు. దీని వల్ల మహమ్మారి ప్రభావం లేదని భావించారు. కానీ జూలై నెల తర్వాత ఎమర్జెన్సీని జపాన్లో ఎత్తివేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆత్మహత్యలు పెరిగినట్లు గుర్తించారు. కరోనా వైరస్ వల్ల జపాన్ ఆత్మహత్యలు పెరిగిన విషయం వాస్తవమే అని, ఇక ఈ ఏడాది కూడా ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు వసేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ మిచికో ఉడా తెలిపారు. మహమ్మారి సమయంలో ఆత్మహత్యలు పెరిగే ఛాన్సు ఉన్నట్లు మానసిక నిపుణులు హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులు, వత్తిళ్లు, కుటుంబ ఘర్షణల వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడనున్నది. 2009లో ఆర్థిక విపత్తు తర్వాత మళ్లీ అంత భారీ స్థాయిలో జపాన్లో ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకున్నాయి.