శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 22:23:57

ఐసీయూ బెడ్‌ పెళ్లి వేదిక.. దవాఖాన సిబ్బంద్దే పెళ్లిపెద్దలు..!

ఐసీయూ బెడ్‌ పెళ్లి వేదిక.. దవాఖాన సిబ్బంద్దే పెళ్లిపెద్దలు..!

న్కూయార్క్‌: కరోనా వైరస్‌ ప్రపంచానికే చేదు అనుభవాలను మిగిల్చింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నది. ఈ మహమ్మారి ప్రియమైనవారిని తీసుకెళ్లి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కొందరు ఇప్పటికీ దీనితో ధైర్యంగా పోరాడుతున్నారు. అలాంటి ఒక కథే అమెరికా దేశంలోని టెక్సాస్‌కు చెందిన శాన్ ఆంటోనియోలో కార్లోస్ మునిజ్ అనే వ్యక్తిది. అతడు కొవిడ్‌-19 బారినపడి ప్రాణాలతో పోరాడుతున్నాడు. కాగా, దవాఖాన సిబ్బంది, యాజమాన్యం పెళ్లిపెద్దలుగా మారగా, దవాఖానలోనే తనతో పెళ్లి నిశ్చయమైన యువతిని పెళ్లాడాడు. వందేళ్లు తోడుంటానని భార్యకు అభయమిచ్చాడు. 

కార్లోస్ అనే వ్యక్తికి గ్రేస్ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ముందే కార్లోస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని నగరంలోని మెథడిస్ట్ దవాఖానలో చేర్చారు. రోజులు గడిచిపోయాయి. అతడి ఆరోగ్యం కూడా క్షీణించింది.  దీంతో ఐసీయూకు మార్చారు. కార్లోస్‌కు ఇతర వ్యాధులు లేనప్పటికీ అతడు కోలుకోవడానికి చాలా కష్టపడ్డాడు.   

నెల తర్వాత అతడికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. కానీ, అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. దీంతో దవాఖానలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో అతడికి కాబోయే భార్య గ్రేస్‌ పక్కనే ఉండి సపర్యలు చేసింది. ఇది గమనించిన దవాఖాన సిబ్బంది, యాజమాన్యం వారి వివాహం దవాఖానలోనే చేయాలని నిశ్చయించారు. ఇంకేముంది ఐసీయూలోని బెడ్‌నే పెళ్లివేదికగా మార్చేశారు. దవాఖానను అందంగా అలంకరించి, వారి వివాహాన్ని జరిపించారు. ఆత్మీయతతోకూడిన అందమైన వేడుక నిర్వహించారు. ఈ వేడుక మొత్తాన్ని స్థానిక వార్తా సంస్థ 'కెన్స్ 5' తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసింది. తమను ఒక్కటి చేసిన దవాఖాన సిబ్బందికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని గ్రేస్‌ పేర్కొంది. ఈ సంఘటన ప్రేమ శక్తివంతమైనదని, ఇది ఘోరమైన మహమ్మారిని కూడా తట్టుకోగలదని నిరూపించింది.  logo