సోమవారం 26 అక్టోబర్ 2020
International - Oct 17, 2020 , 12:39:02

ఇమ్రాన్ మీ టైం అయిపోయింది.. ఇక వెళ్లండి!

ఇమ్రాన్ మీ టైం అయిపోయింది.. ఇక వెళ్లండి!

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ అక్క‌డి ప్ర‌భుత్వంపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌‌ ప్రభుత్వంపైన‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాపైన తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న న‌వాజ్ ష‌రీఫ్..‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ క‌లిసి గుజ్రాన్‌వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం కట్టబెట్టాడ‌ని న‌వాజ్ ష‌రీఫ్‌ ఆరోపించారు.

'జావేద్‌ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్ర‌ధాని ప‌ద‌వి కట్టబెట్టారు' అని షరీఫ్‌ వ్యాఖ్యానించారు. కాగా, 2018 ఎన్నికల తర్వాత న‌వాజ్ ష‌రీఫ్‌ బహిరంగ సభలో‌ మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంపై కూడా న‌వాజ్ విమ‌ర్శ‌లు చేశారు. అప్పటి త‌మ‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పని చేసిందని షరీఫ్‌ ఆరోపించారు. ఇప్ప‌టికైనా రాజకీయాల్లో పాకిస్థాన్‌ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు.

దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్థాన్ డెమోక్ర‌టిక్‌‌ మూమెంట్‌ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్) ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న‌ది. ఆదాయానికి మించిన‌ ఆస్తుల కేసులో నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆయ‌న‌కు 2017లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్ర‌స్తుతం అనారోగ్య కార‌ణాల‌తో లండ‌న్‌లో చికిత్స పొందుతున్నారు. 

ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల‌‌ చేపట్టిన సంస్కరణలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న‌దని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని న‌వాజ్ ష‌రీఫ్ విమ‌ర్శించారు. 'మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్‌ ఇక వెళ్లండి' అని వ్యాఖ్యానించారు.  ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు కూడా 'మీ  టైం అయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అంటూ పెద్ద పెట్టున‌ నినాదాలు చేశారు. ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo