మంగళవారం 26 జనవరి 2021
International - Dec 30, 2020 , 08:58:07

అక్రమ ఆస్తుల కేసులో మాజీ మంత్రి అరెస్ట్‌

అక్రమ ఆస్తుల కేసులో మాజీ మంత్రి అరెస్ట్‌

ఇస్లామాబాద్‌ : పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌ను అవినీతి నిరోధక అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. పార్టీ సమావేశం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆసిఫ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎం ఎన్) ప్రతినిధి మరియం ఔరంగజేబ్ పేర్కొన్నారు. లాహోర్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల్లో అరెస్టును అమలు చేసినట్లు ఎన్‌ఏబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసిఫ్ 2004 నుంచి 2008 వరకు దుబాయి ఇకామా (వర్క్ పర్మిట్)ను కలిగి ఉన్నారని, కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్‌గా తన సేవలకు మొత్తం 136 మిలియన్ డాలర్లు సంపాదించారని బ్యూరో తెలిపింది. తనకు లభించిన జీతం వివరాలు, ఇతర సమాచారం సమర్పించాలని ఆదేశించారు. ‘ఖవాజా ఆసిఫ్ విచారణ సమయంలో సహకరించడంలో నిరంతరం విఫలమయ్యాడు’ అని ఎన్‌ఏబీ పేర్కొంది.

పీఎంఎల్ ఎన్ చీఫ్ మాజీ ప్రీమియర్ నవాజ్ షరీఫ్ అరెస్టును ఖండించారు. నవాజ్ షరీఫ్‌ను వ్యతిరేకించాలని ఆసిఫ్‌పై ఒత్తిడి తెస్తున్నారని, అలా చేయడానికి నిరాకరించడంతో అరెస్టు చేశారని అతని కుమార్తె మరియం నవాజ్ ఆరోపించారు. అరెస్టుతో, పార్టీ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్, సీనియర్ సభ్యులు హంజా షెబాజ్, రానా సనావుల్లా, జావేద్ లతీఫ్, అహ్సాన్ ఇకాబ్ల్, షాహిద్ ఖాకాన్ అబ్బాసి, సాద్ రఫీక్ తదితరులతో సహా అవినీతి కేసులను ఎదుర్కొంటున్న పీఎంఎల్ ఎన్ నాయకుల జాబితాలో ఆసిఫ్ ఇప్పుడు చేరాడు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (11 ప్రతిపక్ష పార్టీల కూటమి)  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశం పొడవునా నిరసన ర్యాలీలు జరుగుతున్న సమయంలో అరెస్టు జరిగింది.


logo