గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 15:03:17

పాకిస్థాన్‌ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది: పీవోకే కార్యకర్త

పాకిస్థాన్‌ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది: పీవోకే కార్యకర్త

జెనీవా: పాకిస్థాన్‌ తమను జంతువుల్లా చూస్తోందని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన హక్కుల కార్యకర్త మొహద్ సజ్జాద్ రాజా ఆరోపించారు. పాక్‌ దురాగతాలను నిలువరించాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస)ని ఆయన కోరారు. జెనీవాలో గురువారం జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో సజ్జాద్ మాట్లాడారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆజాద్ కాశ్మీర్ ఎన్నికల చట్టం (2020) తమ రాజకీయ, పౌర, రాజ్యాంగ హక్కులను హరించివేసిందని ఆయన మండిపడ్డారు. తమ సొంత ప్రాంతంలో తమను దేశద్రోహులుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ తమను జంతువుల మాదిరిగా చూడకుండా నిలువరించాలని పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజల తరుఫున ఐరాసను తాను కోరుతున్నానని మొహద్ సజ్జాద్ రాజా అభ్యర్థించారు.

మరోవైపు పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించాలని పీవోకేకు చెందిన హక్కుల కార్యకర్త డాక్టర్ అమ్జాద్ ఎ మీర్జా డిమాండ్‌ చేశారు. గిల్గిట్‌బాల్టిస్థాన్‌లో రెండు వలసరాజ్యాలను తాము ఎదుర్కొంటున్నామని ఐరాస సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాముల నిర్మాణం వల్ల నదులు కుదించుకుపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు తాగు నీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుల ఆర్థిక భారమంతా భవిష్యత్తులో తమపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని ఆయన కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo