బుధవారం 05 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 17:09:59

అత్యవసర భద్రతా సమావేశానికి పిలుపునిచ్చిన పాక్‌ ప్రధాని

అత్యవసర భద్రతా సమావేశానికి పిలుపునిచ్చిన పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేహ్‌ను సందర్శించిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ టాప్‌ సెక్యూరిటీ ఉన్నతాధికారులతో అత్యున్నత భద్రతా సమావేశానికి పిలుపునిచ్చారు. దేశ అంతర్గత, బాహ్య భద్రతా పరిస్థితులపై భేటీలో ఇమ్రాన్‌ ఖాన్‌ సమీక్షించారు. సమావేశం ద్వారా దేశ సార్వభౌమాధికారం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు సంకల్పం వ్యక్తం చేశారు. భేటీలో ఆ దేశ రక్షణశాఖ మంత్రి పర్వేజ్‌ ఖట్టక్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ జనరల్‌ నదీమ్‌ రజా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ జాఫర్‌ మహమూద్‌ అబ్బాసి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ముజాహిద్‌ అన్వర్‌ ఖాన్‌, ఐఎస్‌ఐ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ పాల్గొన్నారు. 

భారత్‌, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఈ తరుణంలో పాక్‌ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి.. చైనా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి వాంగ్‌ యీ తో టెలిఫోన్‌లో సంభాషించారు. కశ్మీర్‌ సంఘటనలు, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. టెలిఫోనిక్‌ సంభాషణలో ఖురేషీ మాట్లాడుతూ... భారత్‌ ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీస్తోందన్నారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితిని క్షీణింపజేస్తుందన్నారు. భారత్‌ రెచ్చగొట్టే చర్యలపట్ల పాక్‌ సంయమనం పాటిస్తోందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. 

భారత్‌ అంతర్గత వ్యవహారాలపై సైతం ఖురేషీ జోక్యం చేసుకుంటూ జమ్ము కశ్మీర్‌లో నివాస చట్టాల అంశాన్ని కూడా లేవనెత్తారు. పాక్‌-చైనా వ్యూహాత్మక భాగస్వాములన్న ఖురేషి ఈ ప్రాంతంలోని వివాదాలను ఏకపక్షంగా, చట్టవిరుద్దంగా, బలవంతపు చర్యలతో కాకుండా శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. వన్‌-చైనా పాలసీకి పాక్‌ కట్టుబడి ఉందన్నారు. హాంకాంగ్‌, తైవాన్‌, టిబెట్‌, జిన్జియాంగ్‌తో సహా చైనా ప్రయోజనాలకు తమ దేశం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు మద్దతును పునరుద్ఘాంటించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లఢక్‌లోని ఇండియన్‌ ఆర్మీకి చెందిన నీము బేస్‌ను ఆకస్మికంగా సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని వెంట చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నారవణే ఉన్నారు. సైనికులను ఉద్దేశించి ప్రధాని ఇక్కడ ప్రసంగించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ప్రధాని పర్యటన ప్రధానంగా నిలిచింది. సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసింది. అభివృద్ధి యుగం మొదలైందని ప్రధాని పేర్కొన్నారు. కాగా చైనా పేరును ప్రధాని నేరుగా ప్రస్తావించనప్పటికి బీజింగ్‌ స్పందిస్తూ ప్రధాని ప్రకటనను తిరస్కరించింది. 


logo